క్రైమ్

అక్రమ ఆయుధాల సరఫరా - బిహార్ వ్యక్తి అరెస్ట్, తుపాకులు స్వాధీనం

హైదరాబాద్, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : రాచకొండ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చర్లపల్లి పోలీసులు, మల్కాజిగిరి ఎస్‌వోటీ బృందాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో విజయాన్ని సాధించారు. బిహార్‌కు చెందిన శివకుమార్‌ను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ సుదీర్‌బాబు తెలిపారు. అతడి సహచరుడు కృష్ణ పాసవాన్‌ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. గంజాయి కేసులు సహా పలు నేరాల్లో శివకుమార్‌ నిందితుడని, ఈజీ మనీ కోసం బిహార్‌ నుంచి తుపాకులు తెచ్చి విక్రయిస్తున్నాడని పోలీసులు చెప్పారు.

సంయుక్త ఆపరేషన్ దాడిలో 3 తుపాకులు, 10 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆయుధాలను నిందితుడు రాష్ట్రంలో అక్రమంగా విక్రయించాలనుకున్నట్లు విచారణలో తెలిసిందని తెలిపారు. రాచకొండ సీపీ సుదీర్‌బాబు మాట్లాడుతూ, “అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న వారిపై ఎలాంటి రాయితీలు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.

Back to top button