
Supreme Court: భర్త నుంచి విడాకులు కోరుతూ భరణం కింద ముంబైలో ఖరీదైన ఫ్లాట్, బీఎండబ్ల్యూ కారు, రూ.12 కోట్ల నగదు డిమాండ్ చేసిన భార్య కేసు విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సీజేఐ జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆర్టికల్ 142 కింద అధికారాలను ఉపయోగిస్తూ ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. అయితే.. భరణం కింద పెద్ద మొత్తంలో డబ్బు, బీఎండబ్ల్యూ కారును ఆ మహిళ కోరడాన్ని న్యాయబద్ధం కాని డిమాండ్లుగా అభిప్రాయపడింది. గతంలో..ఆమె ముంబై లో ఇంటిని తీసుకునేందుకు ఓ ఒప్పంద పత్రంపై సంతకం చేసిన విషయాన్ని గుర్తు చేసిన న్యాయస్థానం.. ఆ ఇంటినే విడాకుల సెటిల్‌మెంట్ కింద తీసుకోవాలని స్పష్టం చేసింది. చదువుకున్న వారు భరణం కోసం ఇలా అడుక్కోకూడదని జస్టిస్ గవాయ్ ఆ మహిళకు సూచించారు.
దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన మహిళ డిమాండ్లు
కొద్ది వారాల క్రితం ఈ కేసుపై సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా సదరు మహిళ భరణంగా భర్త నుంచి రూ.12 కోట్లు,ముంబైలో ఇల్లు, బీఎండబ్ల్యూ కారు కావాలని అడగడంతో సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును విచారించిన సీజేఐ జస్టిస్ గవాయ్ ఈ డిమాండ్లను విని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివి, సొంతంగా సంపాదించుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తంలో భరణం అడగడంపై సరికాదని సీజేఐ సదరు మహిళకు సూచించారు. వివాహం అయ్యి 18 నెలలు మాత్రమే అయ్యాయని అప్పుడే విడాకులు తీసుకునే వారు బీఎండబ్ల్యూ కారు కావాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. దానికి ఆమె బదులిస్తూ..తన భర్త ధనవంతుడని తాను మానసిక సమస్యలతో బాధ పడుతున్నందుకు అతడే తనకు విడాకులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడని తెలిపింది. వైద్యం కోసం ఖర్చు ఎక్కువ అవుతుందనే కారణంతోనే భరణం అడుగుతున్నట్లు వివరించింది. తన బిడ్డను కూడా తనకు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఉద్యోగాన్ని వదులుకోవాలని సూచించడంతో గతంలో ఉద్యోగం మానేశానని చెప్పింది. ఆ తర్వాత కేసుపై ఆర్డర్‌ను రిజర్వ్ చేశారు. తాజాగా విడాకులు మంజూరు చేశారు.
Read Also: కూతురు ముందే అల్లుడిని కాల్చి చంపిన తండ్రి.. ఎందుకంటే!