
ఏపీలో కూటమి ప్రభుత్వం… ఒద్దికకు మారు పేరుగా మారింది. అందుకే శాఖా మంత్రి ఎవరైనా… అందరూ స్పందిస్తున్నారు. ఎవరికి ఇష్టమొచ్చిన హామీలు వారు ఇచ్చేస్తున్నారు. అది వారి పరిధిలోకి వస్తుందా..? లేదా..? అన్న ఆలోచన కూడా చేయడం లేదు. ఉదాహరణకు… తిరుపతి తొక్కిసలాట ఘటన తీసుకుందాం. వైకుంఠ ఏకాదశి టికెట్ల కోసం భక్తులు పెద్దసంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగింది. అప్పుడు ఆరుగురు మరణించారు. ఆ సమయంలో… పవన్ కళ్యాణ్ కోపంతో, బాధతో, ఆవేశంతో ఊగిపోయారు. ప్రజలకు క్షమాపణ చెప్పారు. అంతేనా… టీటీడీ నిర్లక్ష్యం వల్లే జరిగిందని… చైర్మన్, అధికారులు కూడా సారీ చెప్పాలన్నారు. ఈ అంశం… అప్పట్లో కాస్త వివాదాస్పదమైంది. సంబంధంలేని వారు క్షమాపణ చెప్పమంటే చెప్పేస్తామా అన్న టీటీడీ చైర్మన్… ఆ తర్వాత సారీ చెప్పేశారులేండి. అది అటుంచితే… తిరుపతి తొక్కిసలాట ఘటన దేవాదాయ శాఖ కిందికి వస్తుంది. అది పవన్ కళ్యాణ్ శాఖ కాదు. ఆ శాఖకు మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు సారీ చెప్పినట్టు… టీటీడీని సారీ ఎందుకు చెప్పమన్నట్టు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఎందుకు మిన్నకున్నట్టు…? ఇదేకాదు.. తిరుమలలో కల్తీ నెయ్యి అంశంపై కూడా పవన్ కళ్యాణ్.. తెగ ఫీలైపోయారు. తప్పు జరిగింది తన వల్ల కాకపోయినా… తన శాఖ తరపు నుంచి కాకపోయినా… వెంటనే ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.
సరే… అది ఎప్పుడో జరిగిపోయిన కథ అనుకుంటే.. ఇప్పుడు.. పవన్ కళ్యాణ్ బదులు మంత్రి నారా లోకేష్ క్షమాపణ చెప్పారు. ఎందుకంటే… కడప జిల్లా నల్లమలలో ఆధ్యాత్మిక కేంద్రమైన కాశీనాయన ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి చెందిన వసతి భవనాలు, అన్నదాన సత్రాన్ని అటవీ అధికారులు కూల్చేశారు. టైగర్ జోన్‌లో ఆశ్రమం ఉందని.. కొన్నేళ్ల క్రితం నిర్వహకులకు నోటీసులు ఇచ్చామని అంటున్నారు అధికారులు. ఈనెల 7న అన్నదాన సత్రం భవనాన్ని కూల్చివేశారు. ఈ అంశం వివాదాస్పదమైంది. భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆశ్రమ నిర్వహకులు అధికారుల తీరును తప్పుబట్టారు. ఈ విషయం నారా లోకేష్ దృష్టికి వెళ్లింది. దీంతో.. ఆయన క్షమాపణ చెప్పారు. కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాదు.. ఆ భవనాలను తిరిగి నిర్మిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇంత వరకు బాగానే ఉంది… కానీ.. ఆ హామీ ఇవ్వాల్సింది ఎవరు..? అటవీశాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన స్పందించలేదు గానీ… లోకేష్ మాత్రం సారీ చెప్పేశారు. భక్తులకు హామీ ఇచ్చేశారు. ఇదేం రూల్ అంటే…… కూటమిలో అంతే – కూటమిలో అంతే అన్న మాట వినిపిస్తోంది.
ఇక… ఆయనది కాని శాఖ తరపున లోకేష్ సారీ చెప్పడంతో.. పవన్ కళ్యాణ్‌పై విమర్శలు ఎక్కువయ్యాయి. సనాతన ధర్మ పరిరక్షణకు పాటుపడతానంటూ చెప్పుకునే పవన్ కళ్యాణ్… కాశీనాయన ఆశ్రమం విషయంలో ఎందుకు స్పందించడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. తనది కాని టీటీడీ విషయంలో జోక్యం చేసుకుంటారు గానీ… తన శాఖలో జరిగిన విషయాలపై మాత్రం స్పందించరా..? ఇదెట్టా…! అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు జనం.