
మద్యం సేవించడం కేవలం 30 రోజుల పాటు పూర్తిగా మానేస్తే శరీరం, మనసు, ఆర్థిక స్థితిలో ఆశ్చర్యకరమైన మార్పులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ లేదా తరచూ ఆల్కహాల్ తీసుకునే వారికి ఇది ఒక పెద్ద సవాలుగా అనిపించినా.. ఒక్క నెలపాటు మద్యం మానేసిన అనుభవం జీవితాన్నే మార్చేలా ఉంటుందని వారు స్పష్టం చేస్తున్నారు.
మద్యం తాగడం వల్ల మొదటగా నష్టపోయే అవయవం కాలేయమే. ఆల్కహాల్ ప్రభావంతో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. దీర్ఘకాలం ఇదే కొనసాగితే కాలేయానికి తీవ్ర నష్టం కలుగుతుంది. అయితే నెల రోజుల పాటు మద్యం మానేస్తే కాలేయానికి విశ్రాంతి లభించి, దాని పనితీరు క్రమంగా మెరుగుపడుతుంది. శరీరాన్ని శుభ్రపరిచే కాలేయం మళ్లీ ఆరోగ్యంగా పనిచేయడం ప్రారంభిస్తుంది.
ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని మెటబాలిజం రేటు మందగిస్తుంది. దీని కారణంగా కేలరీలు సరిగా ఖర్చు కాకుండా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది. చాలా మంది ఎంత వ్యాయామం చేసినా పొట్ట తగ్గడం లేదని బాధపడతారు. అలాంటి వారు నెల రోజులు మద్యం మానేసి చూడగానే పొట్ట కొవ్వు తగ్గడం, బరువు నియంత్రణలోకి రావడం స్పష్టంగా గమనిస్తారని నిపుణులు చెబుతున్నారు.
మద్యం తాగితే నిద్ర బాగా పడుతుందన్నది చాలామందిలో ఉన్న అపోహ మాత్రమే. ఆల్కహాల్ వల్ల డీహైడ్రేషన్ ఏర్పడి తరచూ మూత్రం రావడం, దాహం వేయడం వంటి సమస్యలతో అర్ధరాత్రి నిద్ర భంగం అవుతుంది. దీంతో నిద్ర నాణ్యత పూర్తిగా పడిపోతుంది. అదే మద్యం మానేస్తే మెదడు ప్రశాంతంగా ఉండి, లోతైన నిద్ర లభిస్తుంది. ఉదయం లేచినప్పుడు శరీరం తాజాగా, ఉల్లాసంగా అనిపిస్తుంది.
చర్మ ఆరోగ్యంపై కూడా మద్యం తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ వల్ల శరీరంలో ఇంఫ్లమేషన్ పెరిగి చర్మంపై ముడతలు తొందరగా వస్తాయి. డీహైడ్రేషన్ కారణంగా ముఖంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. ఒక నెల పాటు మద్యం మానేస్తే చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపడి సహజమైన గ్లో వస్తుంది. ముఖం తాజాగా, ఆరోగ్యంగా కనిపించడం మొదలవుతుంది.
కొంతమంది ఒత్తిడి తగ్గించుకోవడానికి మద్యం తాగుతామని చెబుతుంటారు. కానీ వాస్తవానికి ఆల్కహాల్ ఒత్తిడిని తగ్గించకుండా మరింత పెంచుతుంది. ఆందోళన, టెన్షన్, డిప్రెషన్ లక్షణాలు ఎక్కువవుతాయి. నెల రోజుల పాటు మద్యం మానేస్తే మనసు ప్రశాంతంగా మారి, ఒత్తిడి స్థాయి గణనీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
మద్యం సేవనంతో కండరాలు బలహీనపడతాయి. కండలు నొప్పిగా, మెత్తగా అనిపించడం సాధారణం. ఆల్కహాల్ మానేసిన తర్వాత కండరాలకు సరైన పోషణ అందడంతో బలం పెరుగుతుంది. శరీరం ఫిట్‌గా మారి, ఎనర్జీ స్థాయి కూడా పెరుగుతుంది.
మద్యం తాగే వారిలో మూడ్ స్వింగ్స్ ఎక్కువగా కనిపిస్తాయి. చిన్న విషయాలకే కోపం రావడం, చికాకు, నిరాశ వంటి భావాలు తరచూ వెంటాడుతుంటాయి. ఆల్కహాల్ మానేస్తే ఈ సమస్యలు క్రమంగా తగ్గి, భావోద్వేగ సమతుల్యత మెరుగుపడుతుంది. మనసు స్థిరంగా ఉండి, రోజువారీ జీవితంలో నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది.
శరీర బలం తగ్గిపోవడానికి కూడా మద్యం ఒక ప్రధాన కారణం. ఆల్కహాల్ వల్ల పోషకాలు సరిగా శరీరానికి అందవు. నెల రోజుల పాటు మద్యం మానేస్తే శరీరానికి కావాల్సిన శక్తి తిరిగి లభించి, ఆరోగ్యంగా, బలంగా అనిపిస్తుంది.
ఆరోగ్యంతో పాటు ఆర్థిక పరిస్థితిపైనా మద్యం తీవ్ర ప్రభావం చూపుతుంది. తాగాలన్న కోరికతో తెలియకుండానే ఎక్కువ ఖర్చు అవుతుంది. నెల రోజులు మద్యం మానేసినప్పుడు డబ్బు ఎంత ఆదా అవుతుందో చాలామందికి అప్పుడు అర్థమవుతుంది. జేబులో డబ్బు నిలవడంతో పాటు, ఆర్థిక క్రమశిక్షణ కూడా అలవడుతుంది.
మొత్తంగా చూస్తే కేవలం 30 రోజుల పాటు మద్యం మానేయడం శరీరాన్ని లోపల నుంచి శుభ్రపరచి, మనసును ప్రశాంతంగా మార్చి, జీవితాన్ని ఆరోగ్యదిశగా నడిపిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: సిగ్నల్ దగ్గర పూలు అమ్మే బాలిక కిడ్నాప్.. అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం





