
ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు దిగజారి ప్రవర్తించొద్దని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.విధుల పట్ల అంకితభావం, నిబద్ధతతో ప్రజల విశ్వాసం పొందాలని సూచించారు. అతిక్రమిస్తే తగిన చర్యలు తప్పవని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల సమావేశాలు, సభల్లో చోటు చేసుకుంటున్నకొన్నిసంఘటనలు అవాంఛనీయమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అభిప్రాయపడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో తగని విధంగా ప్రవర్తించటం సరికాదని ఈ మేరకు ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.ఇటీవలి కాలంలో కొంతమంది అఖిల భారత సర్వీసు అధికారులు సామూహిక సమావేశాలు, సభల్లో సర్వీసు హోదాకు తగనటువంటి చర్యలు, హావభావాలు ప్రదర్శిస్తున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి ప్రవర్తన ప్రజల్లో ఆ సర్వీసు అధికారుల మీద నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తుంది. మరియు సేవ యొక్క మాన్యతను దెబ్బతీస్తుందని సీఎస్ అభిప్రాయపడ్డారు.
అఖిల భారత సేవల ప్రవర్తనా నియమావళి, 1968 లోని నిబంధన 3(1) ప్రకారం: ప్రతీ సర్వీసులో సభ్యుడు ఎల్లప్పుడూ సంపూర్ణ నిజాయితీ, విధిపట్ల నిబద్ధత కలిగి ఉండాలి. సర్వీసులో ఉన్న అధికారికి తగని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు.
అఖిల భారత సేవల అధికారులు, అధికారికంగా మరియు ప్రజలతో సంబంధాల విషయంలోనూ, అత్యున్నత స్థాయి నైపుణ్యం, నిజాయితీ, నిబద్ధతను పాటించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు. ఇది ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు అవసరమైన చర్య. కాబట్టి, ఇకపై ఏ అఖిల భారత సర్వీసు అధికారులు అయినా, సామూహిక సమావేశాలు, సభల్లో తగనటువంటి విధంగా ప్రవర్తించడం, హావభావాలు ప్రదర్శించడం వంటి చర్యల నుంచి నుంచి దూరంగా ఉండాలి. ఈ ఆదేశాలను ఉల్లంఘించినచో ఆ అధికారి తగిన చర్యలకు భాద్యుడు అవుతాడు.సచివాలయం కేంద్రంగా పనిచేసే అన్ని శాఖల సెక్రటరీలు, హెచ్ఓడీలు ఈ మేరకు చర్యలు తీసుకుని, తమ పరిధిలో పనిచేసే అధికారులు, ఉద్యోగుల ఈ ఆదేశాలను పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సర్క్యులర్ ను జారీచేసింది.