
Hyderabad Rain: రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి వర్షాలు పడుతున్నాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రయాణీకులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఆఫీస్ నుంచి ఇళ్లకు చేరుకునే సమయంలో వాన కురవడంతో నరకయాతన అనుభవించారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఏ ప్రాంతాల్లో వర్షం కురిసిందంటే?
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వానలు పడ్డాయి. ముఖ్యంగా హైటెక్ సిటీ, గచ్చిబౌలీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్ గూడ, పంజాగుట్ట, లింగంపల్లి, నిజాంపేట, కూకట్ పల్లి, మల్కాజిగిరి, తిరుమలగిరి, దమ్మాయిగూడ, కాప్రాతోపాటు, మేడ్చల్, కీసర, ఘట్ కేసర్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈ ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
అటు సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సిరిసిల్ల, కరీంనగర్, జనగామ జిల్లాలో ఓ మోస్తరు వర్షం కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వానలు మరో మూడు రోజుల పాటు కొనసాగుతాయని వెల్లడించింది. వర్షాలు కురిసే సమయంలో బయటకు రాకపోవడం మంచిదని అధికారులు సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలన్నారు.
Read Also: జూలై 12 వరకు వానలు.. ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ!