తెలంగాణ

హైదరాబాద్ మెట్రో @ 8

హైదరాబాద్ నగర అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ప్రజా రవాణా వ్యవస్థల్లో హైదరాబాద్ మెట్రో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

హైదరాబాద్ నగర అభివృద్ధిలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ప్రజా రవాణా వ్యవస్థల్లో హైదరాబాద్ మెట్రో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ప్రతిరోజూ వేలాది ఐటీ ఉద్యోగులు, నాన్ ఐటీ సిబ్బంది, కాలేజీ విద్యార్థులు, మహిళా ప్రయాణికులు, సాధారణ ప్రజలందరికీ ఇది నమ్మకమైన ప్రయాణ సౌకర్యంగా మారింది. ట్రాఫిక్ రద్దీతో నిండిన భాగ్యనగర రోడ్లపై గంటల కొద్దీ ప్రయాణం చేయాల్సి వచ్చిన రోజుల్ని మార్చేస్తూ, వేగంగా, భద్రంగా, సమయానికి గమ్యస్థానాలకు చేరుస్తూ మెట్రో ప్రజల జీవితాల్లో కీలక భాగంగా నిలిచింది.

ఈ ప్రజా రవాణా వ్యవస్థ ఎనిమిది వసంతాలను పూర్తి చేసుకుని, తొమ్మిదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భం నగర అభివృద్ధికి ఒక మైలురాయిగా చెప్పవచ్చు. ఎనిమిదేళ్ల ఈ ప్రయాణంలో మెట్రో రైల్, దాన్ని నిర్మించిన L&T సంస్థలు కలిపి 205 జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవడం ఈ ప్రాజెక్టుకు లభించిన ప్రజాదరణకు నిదర్శనం.

హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభం 2012లో జరిగింది. దేశంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ విధానంలో రూ. 14,132 కోట్లతో నిర్మాణ పనులు మొదలయ్యాయి. సంవత్సరాల కఠిన శ్రమ తర్వాత 2017 నవంబర్ 28న మియాపూర్ నుండి నాగోల్ వరకు తొలి సేవలను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ తర్వాత మెట్రో విస్తరణ వేగంగా కొనసాగింది. 2019 మార్చిలో ఎల్ బీ నగర్ నుండి అమీర్‌పేట్ వరకు, 2020 ఫిబ్రవరి 7న జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో సేవలు ప్రారంభించడం ద్వారా మూడు కీలక కారిడార్లలో రాకపోకలు అందుబాటులోకి వచ్చాయి.

ప్రస్తుతం ఎరుపు లైన్‌పై మియాపూర్ నుండి ఎల్ బీ నగర్ వరకు, బ్లూ లైన్‌పై రాయదుర్గ్ నుండి నాగోల్ వరకు, గ్రీన్ లైన్‌లో జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైళ్లు నిరంతరాయంగా ప్రయాణికుల సేవలను అందిస్తున్నాయి. రోజుకు 57 మెట్రో రైళ్లు సుమారు 1100 ట్రిప్పులు తిరుగుతూ దాదాపు 25,000 కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సేవలందించడంతో ప్రయాణికులకు రద్దీ సమయంలోనూ, అత్యవసర వేళలలోనూ మెట్రో ప్రధాన ఆధారంగా కొనసాగుతోంది.

రోజుకు సగటున 4.5 నుండి 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ప్రత్యేకించి ఉదయం 8 నుంచి 11 వరకు, అలాగే సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు మూడు లైన్లు పూర్తిగా నిండిపోతాయి. ఒకే కంపార్ట్‌మెంట్‌లో కూడా కాలు పెట్టడానికి స్థలం దొరకని స్థాయిలో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. నవంబర్ 27 వరకు మొత్తం ఎనిమిదేళ్లలో 80 కోట్ల కంటే ఎక్కువ మంది మెట్రోను ప్రయాణ సాధనంగా వినియోగించుకున్నారు.

ఇక మెట్రో రెండో దశ విస్తరణపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. పార్ట్ Aలో 5 కొత్త కారిడార్లు, పార్ట్ Bలో 3 కారిడార్లు మొత్తం 163 కిలోమీటర్ల మేర విస్తరించడానికి సుమారు రూ.43,848 కోట్ల వ్యయం అవసరమని అంచనా వేసి DPRలను కేంద్రానికి పంపింది. ఈ ప్రతిపాదనలు 2026 మార్చిలో ఆమోదం పొందే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ తెలిపింది. ఈ విస్తరణ పూర్తయితే భాగ్యనగర రవాణా వ్యవస్థలో మెట్రో మరింత కీలక పాత్ర పోషించనుంది. నగరాన్ని మొత్తం కలుపుతూ భవిష్యత్తు పర్యాటక, వ్యాపార, ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా ముందుకు సాగుతుంది.

ALSO READ: Bhatti Vikramarka: బీసీ బిల్లుపై ఎంపీలతో భట్టి సమావేశం, ప్రధానితో చర్చించాలని నిర్ణయం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button