
మునుగోడు,క్రైమ్ మిర్రర్:- సంక్రాంతి పండగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పండగ పూర్తి చేసుకొని ఒకే సారి హైదరాబాద్ నగరానికి భారీగా వాహనాలు వచ్చే నేపథ్యంలో, నేషనల్ హైవే- 65 (హైద్రాబాద్- విజయవాడ) పై చిట్యాల మరియు పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున, ట్రాఫిక్ జామ్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నందున ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా మరియు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా, ప్రయాణికులకు సురక్షితమైన మరియు సాఫీ ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ దారి మళ్లింపు చర్యలు చేపట్టిందని జిల్లా ఎస్పి గారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ క్రమంలో ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు క్రింద సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
దారి మళ్లింపు వివరాలు:
1) గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు :
గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి – మాల్ మీదుగా హైదరాబాద్.
2) మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు :
మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండపల్లేపల్లి – చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్.
3) నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు :
నల్లగొండ – మార్రిగూడ బై పాస్ -మునుగోడు → నారాయణపూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65)మీదుగా హైదరాబాద్.
4.) విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారి వాహనాలు..
కోదాడ-హుజూర్నగర్-మిర్యాలగూడ-హాలియా-చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.
5). ఎన్. హెచ్ 65 (విజయవాడ -హైదరాబాద్ )రహదారి పై చిట్యాల,పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుండి భువనగిరి గుండా హైద్రాబాద్ మళ్లించడం జరుగును.
ఈ మార్గాల ద్వారా వెళ్లడం వల్ల ప్రధాన రహదారి విజయవాడ, హైద్రాబాద్ పై (ఎన్. హెచ్ 65 )ట్రాఫిక్ ఒత్తిడి తగ్గి, ప్రయాణికులు గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంక్రాంతి పండగ పూర్తి చేసుకున్న ప్రజలంతా తమ గమ్యస్థానాలకు హైద్రాబాద్కు సురక్షితంగా చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యం. ట్రాఫిక్ రద్దీ కారణంగా ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నాం. ప్రయాణికులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలను అనుసరించి, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ఓర్పుతో ప్రయాణించాలి. రోడ్డు భద్రతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం.” అని తెలిపారు.పండగ రోజులలో ట్రాఫిక్ పోలీసులు కీలక కూడళ్ల వద్ద విధులు నిర్వహిస్తూ, డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా డయల్ 100 ని సంప్రదించాలని జిల్లా ఎస్పి కోరారు.





