తెలంగాణ

గర్భిణీ స్త్రీలకు నరకం చూపిస్తున్న హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఏరియా దవాఖానలో ఇప్పుడు వైద్య లేక గర్భిణీ స్త్రీలు కునారిల్లుతున్నారు. ప్రతి నెలా 180 నుంచి 200 కాన్పులు చేసి రికార్డులు సృష్టించిన ఈ దవాఖానకు ఇప్పుడు కాన్పులకు వెళ్లాలంటేనే గర్భిణులు హడలిపోతున్నారు.

మత్తు డాక్టర్ అందుబాటులో లేక గంటల తరబడి పురిటి నొప్పులు భరిస్తూ నరకయాతన పడుతున్నారు. సోమవారం ఆరుగురు గర్భిణులకు కాన్పులు చేయకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు వారంతా నరకం చూశారు.

వివిధ గ్రామాలకు చెందిన ఆరుగురు గర్భిణులు సోమవారం ఉదయం 8 గంటలకు దవాఖానకు వచ్చారు. 12 గంటలకు ఆపరేషన్‌ చేసేందుకు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ, మత్తు వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చే వరకు వారు అలానే బెడ్‌పై ఉండాల్సి వచ్చింది.

అప్పటికే వారికి యూరిన్‌ కేథటర్‌ వేయడం, నొప్పులు పెరగడంతో గర్భిణుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. ఏడు గంటలపాటు వారంతా నరకం అనుభవించారు.

ఈ క్రమంలో ఓ గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య డ్యూటీ డాక్టర్‌ ఒకసారి వచ్చి పరిస్థితిని చూశారు. మత్తు వైద్యులు లేరని, వచ్చిన తర్వాత ఆపరేషన్లు చేస్తామని చెప్పి వెళ్లిపోయారు. దీంతో గర్భిణుల బంధువులు మీడియాకు సమాచారం ఇచ్చారు.

మీడియా అక్కడికి రావడం, బంధువులు ఆందోళనకు దిగితే తప్ప వైద్యుల్లో కదలిక రాలేదు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మత్తు వైద్యుడిని పిలిపించి రాత్రి 8:30 గంటలకు కాన్పులు చేశారు.

Back to top button