
శబరిమల యాత్రకు వెళ్లిన భర్త చేసిన ఒక చర్య చివరకు భార్య ప్రాణాలు తీసిన విషాదంగా మారింది. దేవుడి సన్నిధిలో పూజల సమయంలో తన స్థానంలో మరో మహిళను ఎందుకు కూర్చోబెట్టావని భార్య ప్రశ్నించడమే ఈ ఘోర ఘటనకు కారణమైంది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం ఆలూరు తాలూకా పరిధిలోని యడూరు గ్రామం సమీపంలో చోటు చేసుకుని స్థానికంగా కలకలం రేపింది.
కుమార్ (42), రాధ (40) దంపతులకు 22 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే గత ఎనిమిదేళ్లుగా కుటుంబ విభేదాల కారణంగా ఇద్దరూ వేర్వేరు ఇళ్లలో నివసిస్తున్నారు. కుమార్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడన్న అనుమానం రాధలో ఆగ్రహాన్ని పెంచింది. జనవరి మొదటి వారంలో శబరిమల యాత్రకు వెళ్లిన కుమార్.. పూజల సమయంలో భార్య స్థానంలో ఆ మహిళను కూర్చోబెట్టాడని రాధకు తెలిసింది.
ఈ నెల 10న శబరిమల నుంచి ఇంటికి వచ్చిన కుమార్‌ను రాధ నిలదీసింది. దేవుడి సన్నిధిలో కూడా తనకు అవమానం చేశావని ప్రశ్నించింది. అదే సమయంలో మాటల వాగ్వాదం చోటు చేసుకుని, అది తీవ్ర కోపంగా మారింది. ఆగ్రహంతో కుమార్ రాధపై దాడి చేసి ఆమెను హత్య చేశాడు.
హత్య అనంతరం ఆధారాలు మాయం చేయాలనే ఉద్దేశంతో రాధ మృతదేహాన్ని యగచి నదిలో పడేశాడు. అనంతరం తనలో కలిగిన భయం, పశ్చాత్తాపంతో కుమార్ స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. సమాచారం అందుకున్న ఆలూరు పోలీసులు కేసు నమోదు చేసి, నదిలో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాలు, అనుమానాలు ఎంతటి ప్రాణాంతక పరిణామాలకు దారి తీస్తాయో ఈ ఘటన మరోసారి స్పష్టం చేస్తోంది.





