
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో వెలుగుచూసిన ఓ దారుణ ఘటన మహిళల భద్రత, వివాహ వ్యవస్థలో మోసాలు, మానసిక వేధింపులపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నో ఆశలు, కలలతో పెళ్లి చేసుకున్న ఒక యువతి జీవితం వివాహం జరిగిన కొద్ది రోజులకే నరకంగా మారింది. భర్త డాక్టర్ అని గర్వంగా భావించిన ఆమెకు, అదే వ్యక్తి తన జీవితాన్ని అంధకారంగా మార్చుతాడని ఊహించలేదు.
గోరఖ్‌పూర్‌లోని ఒక ఇంటర్ కాలేజీలో పనిచేస్తున్న యువతికి, నవంబర్ నెలలో గోరఖ్‌నాథ్ ప్రాంతానికి చెందిన ఓ దంత వైద్యుడితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో యువతి కుటుంబం సామాజిక స్థాయికి మించి భారీగా కట్నకానుకలు సమర్పించింది. డాక్టర్ అల్లుడు దొరికాడన్న ఆనందంతో ఆ కుటుంబం ఎంతో సంతోషపడింది. అయితే పెళ్లి తర్వాత బయటపడిన నిజాలు ఆ ఆనందాన్ని క్షణాల్లోనే చిదిమేశాయి.
వివాహమైన మొదటి రాత్రి నుంచే భర్త ప్రవర్తన యువతికి అనుమానంగా మారింది. శోభనం గదిలో ఉండాల్సిన భర్త, ఏదో ఒక సాకుతో గది నుంచి తప్పించుకునేవాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. కొన్నిసార్లు నిద్రపోతానని చెప్పి దూరంగా ఉండేవాడని, మరికొన్నిసార్లు పనులున్నాయంటూ బయటకు వెళ్లిపోయేవాడని వివరించింది. మొదట్లో కొత్త పెళ్లి కాబట్టి ఇలాంటి సంకోచం సహజమేనని భావించిన ఆమె.. భర్తలో మార్పు వస్తుందనే ఆశతో దాదాపు 20 రోజుల పాటు మౌనంగా భరించింది.
అయితే భర్త ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆమెకు అనుమానం మరింత బలపడింది. ఒకరోజు ధైర్యం చేసి భర్తను నేరుగా నిలదీయగా, అతడు తాను లైంగికంగా అసమర్థుడినని ఒప్పుకున్నట్లు బాధితురాలు తెలిపింది. ఈ నిజం తెలుసుకున్న ఆమె షాక్‌కు గురైంది. పెళ్లికి ముందు ఈ విషయం దాచిపెట్టి, తనను మోసం చేశారన్న ఆవేదన ఆమెను కుంగదీసింది.
తమ కొడుకు లోపం గురించి ముందే తెలిసి కూడా పెళ్లి చేసిన అత్తమామలను యువతి ప్రశ్నించింది. అయితే వారు తప్పును అంగీకరించకుండా, ఆమెపైనే నిందలు మోపడం ప్రారంభించారని ఫిర్యాదులో పేర్కొంది. తమ కుటుంబ పరువు తీస్తోందని చెప్పి మానసికంగా వేధించారని, చివరకు భరించలేక పుట్టింటికి వెళ్లిపోయినట్లు తెలిపింది.
అక్కడితో వేధింపులు ఆగలేదు. జనవరి 1న బాధితురాలి సోదరి ఫోన్ చేసి, సోషల్ మీడియాలో అత్యంత అసభ్యకరంగా తమ గురించి పోస్టులు వస్తున్నాయని తెలియజేసింది. నిందితులు ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి, బాధితురాలు మరియు ఆమె సోదరీమణులపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య ఆరోపణలు చేస్తూ ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి అసభ్య సందేశాలు పంపుతూ తీవ్ర మానసిక వేధింపులకు గురిచేశారని బాధితురాలు పేర్కొంది.
ఈ పరిణామాలతో తీవ్రంగా కుంగిపోయిన యువతి.. అన్ని సాక్ష్యాధారాలతో పోలీసులను ఆశ్రయించింది. గోరఖ్‌నాథ్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శశి భూషణ్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడైన దంత వైద్యుడు, అతని తండ్రిపై మోసం, ఐటి యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సైబర్ క్రైమ్ విభాగం ఫేక్ సోషల్ మీడియా ఖాతాల ఐపీ అడ్రస్‌లను పరిశీలించగా, అవి నిందితులకే చెందినవని తేలినట్లు పోలీసులు వెల్లడించారు. వైద్య వృత్తిలో ఉండి, సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ALSO READ: భార్య గుడ్డు కూర వండలేదని భర్త ఆత్మహత్య





