మర్రిగూడ,క్రైమ్ మిర్రర్:- మర్రిగూడ మండల కేంద్రంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయం లక్ష్యంగా చేసుకున్న దుండగులు, ఆలయ హుండీని పగులగొట్టి అందులోని నగదును దోచుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో దేవాలయంలోకి చొరబడిన దుండగులు, అత్యంత నేర్పుగా హుండీ తాళాలు పగులగొట్టి లోపల ఉన్న కానుకలను అపహరించారు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి హుండీ పగిలి ఉండటం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆలయ కమిటీకి, పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఆలయ పరిసరాల్లోని సిసిటివి ఫుటేజీని పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఆలయ పూజారి ఎల్వీ శర్మ, పొనుగోటి విజయ రామారావు, చెరుకు శ్రీరామ్ గౌడ్ కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదును అందజేశారు.
పవిత్రమైన ఆలయంలో ఇలాంటి అపచారం జరగడంపై, స్థానిక భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఈ ప్రాంతంలోని ఆలయాల్లో నిఘా తక్కువగా ఉన్న సమయంలో, చోరీలు జరిగిన దాఖలాలు ఉన్నాయని, భద్రత విషయంలో అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. దేవుడి సన్నిధిలో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం అత్యంత విచారకరమని, పోలీసులు వెంటనే స్పందించి నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధిని ఆత్మహత్య
