తెలంగాణ

అర్హులైన జర్నలిస్టులకు ఇల్లు స్థలాలు, ఇండ్లకు మంజూరు…ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హామీ

మిర్యాలగూడ, జూలై 6 (క్రైమ్ మిర్రర్): మిర్యాలగూడ నియోజకవర్గంలో పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇల్లు స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తానని స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) హామీ ఇచ్చారు. ఆదివారం ఐఎంఏ భవనంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ‘‘సామాజిక సేవ నుంచి రాజకీయాల్లోకి వచ్చాను. ఇదంతా జర్నలిస్టుల సహకారంతోనే సాధ్యమైంది. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి అర్హ జర్నలిస్టులందరికీ ఇల్లు స్థలాలు, ఇండ్లు మంజూరు చేయిస్తాను. మండలాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు కూడా వీలైనంత త్వరగా స్థలాలు మంజూరవుతాయి’’ అని తెలిపారు. సమాజంలో అవినీతి, అక్రమాలపై జర్నలిస్టులు కళ్ళు పెట్టాలని, అవాస్తవాలను రాయకుండా, వాస్తవాలను వెలికితీసి ప్రజలకు సరిగ్గా సమాచారం అందించాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధిలో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని, ఎవరైనా సాంకటంలో ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, తాను సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధమని చెప్పారు.

శాంతి భద్రతల కోసం జర్నలిస్టుల సహకారం కావాలి : డీఎస్పీ రాజశేఖర్ రాజు వ్యాఖ్య

స్థానిక డీఎస్పీ కె. రాజశేఖర్ రాజు మాట్లాడుతూ, ‘‘మిర్యాలగూడలో జర్నలిస్టులు ఐక్యంగా పని చేస్తూ హక్కుల కోసం పోరాడుతున్నారు. జర్నలిస్టులు శాంతిభద్రతల పరిరక్షణలో ఇప్పటివరకు చాలా సహకారం అందించారు. భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగించాలి. మీరు అవినీతి, అసాంఘిక కార్యకలాపాల గురించి సమాచారాన్ని అందిస్తే, వాటిని అడ్డుకునేందుకు చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’’ అని అన్నారు.

జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి : ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు అయూబ్

టిడబ్ల్యూజెఎఫ్ జిల్లా అధ్యక్షులు అయూబ్ మాట్లాడుతూ, ‘‘జర్నలిజం ఒక బాధ్యతతో కూడిన సామాజిక సేవ. ప్రజా సమస్యలను వెలికితీసి వాటి పరిష్కారం కోసం జర్నలిస్టులు ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. కానీ పాలకులు వీరి సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇల్లు స్థలాలు, ఇండ్లు ఇవ్వడంలో ఆలస్యం అవుతుంది. అలాగే జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ, ఆరు రోగాలతో బాధపడే జర్నలిస్టులకు వైద్య సేవల్లో సౌలభ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని తెలిపారు.

జర్నలిస్టుల ఐక్యతే హక్కుల సాధనకు మార్గం

ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడపురి వెంకన్న మాట్లాడుతూ, ‘‘పేరుకు జర్నలిస్టులు ప్రతిష్టతో కనిపించినా, వారి కుటుంబాలు చాలా కష్టాల్లో ఉంటాయి. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభమైన మీడియా నిజానికి ఎన్నో ఒత్తిడులను ఎదుర్కుంటూ పనిచేస్తోంది. జర్నలిస్టుల సంక్షేమానికి పాలకులు ముందుకు రావాలి’’ అన్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడు ఖాజా హమీదొద్దీన్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు గుండా మహేష్, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగరావు తదితరులు మాట్లాడుతూ జర్నలిస్టుల ఐక్యతే సమస్యల పరిష్కారానికి మార్గమని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే, డీఎస్పీ లకు ఘన సత్కారం 

కార్యక్రమం ముగింపు సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, డీఎస్పీ రాజశేఖర్ రాజు లను శాలువాలు కప్పి, పూలదండలతో ఘనంగా సత్కరించారు. అదే విధంగా డిసిసి ప్రధాన కార్యదర్శి బాలు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజహర్ లను కూడా సన్మానించారు. సమావేశానికి వందలాది మంది జర్నలిస్టులు హాజరై ఉత్సాహంగా పాల్గొన్నారు. చివరగా అందరికీ మెమెంటోలు అందజేశారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button