
-
32 మంది విద్యార్థినులకు అస్వస్థత.. ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు
క్రైమ్ మిర్రర్, నల్లగొండ ప్రతినిధి : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఇటీవల 32 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన ఘటనలో జిల్లా కలెక్టర్ ఇళా త్రిపాఠి చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేలాద్రిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా నిర్లక్ష్యం వహించిన మరో నలుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హాస్టల్ నిర్వహణలో పాత్ర ఉన్న నలుగురు వర్కర్లను బదిలీ చేశారు.
జూలై 14న మధ్యాహ్న భోజనం అనంతరం ఈ పాఠశాలలో 32 మంది విద్యార్థినులు ఆకస్మికంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తక్షణమే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఆహారంలో కలుషిత పదార్థాలే కారణమని ప్రాథమిక విచారణలో తేలడంతో, సంబంధిత అధికారులపై జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పాఠశాలల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.