HomeజాతీయంHimanta vs Gogoi: హిమంత vs గొగోయ్… అస్సోంలో ‘పాక్’ రాజకీయ రచ్చ!

Himanta vs Gogoi: హిమంత vs గొగోయ్… అస్సోంలో ‘పాక్’ రాజకీయ రచ్చ!

అస్సాంలో రాజకీయాలు ఒక్కసారిగా వెడెక్కింది. తన కుటుంబానికి పాకిస్థాన్ ఏజెంట్ అలీ తౌఖీర్ షేక్‌తో సంబంధాలున్నాయంటూ ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ  చేసిన ఆరోపణలపై లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్  మండిపడ్డారు. సిట్ నివేదికను ముఖ్యమంత్రి తొక్కిపెట్టారని ఆరోపించారు. తన భార్య, మైనర్ పిల్లలను కూడా ఇందులోకి లాగారని, వారిపై అసంబద్ధమైన, తప్పుడు ఆరోపణలు చేసిన సీఎంపై చట్టపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు.

భూముల వ్యవహారం నుంచి దారి మళ్లించేందుకే..

శర్మ కుటుంబంపై భూముల ఆరోపణలున్నాయని, వాటి నుంచి దారి మళ్లించేందుకే తమపై వివాదాలు సృష్టిస్తున్నారని   గొగోయ్ చెప్పారు. తనకు పాక్‌తో సంబంధాలున్నట్టు రుజువు చేసే ఎలాంటి సమాచారం లేకపోవడంతో ‘సిట్’ నివేదికను ముఖ్యమంత్రి తొక్కిపెట్టారని తెలిపారు. ఆయన చెప్పినట్టు ఇది జాతీయ భద్రతా అంశమే అయితే ఆరు నెలలుగా ఎందుకు ఖాళీగా కూర్చున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ జనసమీకరణ జరుపుతుండటం, ప్రజాదరణ పెరుగుతుండటం చూసి ముఖ్యమంత్రి ప్రెస్‌కాన్ఫరెన్స్ అంటూ తనపై ఆరోపణలు దిగారని తెలిపారు.

పాకిస్థాన్‌తో సంబంధాలు అవాస్తవం

తన భార్య పాకిస్థాన్‌కు వెళ్లడం నిజమేనని, అయితే వృత్తి సంబంధమైన పనిలో భాగంగానే అక్కడికి వెళ్లాల్సి వచ్చిందని గొగోయ్ చెప్పారు. ఆమెతో పాటు తాను 2013లో పది రోజుల పాటు పాక్ వెళ్లానని, ఇందులో రహస్యం కానీ చట్టవ్యతిరేకం కానీ ఏదీ లేదని వివరించారు. విచారణలో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలపై కూడా గొగోయ్ తోసిపుచ్చారు.   ముఖ్యమంత్రి తన మైనర్ పిల్లలను కూడా ఇందులోకి లాగడంపై గొగోయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హిమంత బిశ్వ శర్మ ఏమన్నారంటే?

గొగోయ్ 2013లో పాకిస్థాన్ వెళ్లడాన్ని హిమంత బిశ్వ శర్మ  ఎక్స్ లో తాజాగా ప్రశ్నించారు. వీసా పర్మిషన్ ఉన్న ప్రాంతాలకు, ఆయన పర్యటించిన లొకేషన్లకు మధ్య తేడాలున్నాయని అన్నారు. తక్షశిల అంటూ గొగోయ్ చెప్పిన ప్రదేశం ఇస్లామాబాద్‌లో లేదని, పాకిస్థాన్‌లోని రావల్పిండి జిల్లాలో ఉందని అన్నారు. ఇది అనేక ప్రశ్నలకు తావిస్తోందన్నారు. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్‌లకు మాత్రమే పర్యటనకు వీసా అనుమతిస్తుంటే ఆయన తక్షశిల ఎలా వెళ్లారని నిలదీశారు. నిర్దేశించిన ప్రదేశాల్లో మినహా ఇతర చోట్లకు వెళ్లేందుకు పాకిస్థాన్ ఇమిగ్రేషన్ రూల్స్ అనుమతించవన్నారు. రావల్పిండిలో పాకిస్థాన్ ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్ కూడా ఉందన్నారు. గొగోయ్‌ వెళ్లడానికి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం అస్సోంలో రాజకీయ దుమారం రేపుతోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments