
High Court: నందమూరి బాలకృష్ణ- డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక అంచనాలే. ఈ కాంబోలో తెరపైకి వచ్చిన ప్రతి చిత్రంలో ప్రత్యేకమైన మ్యాస్ ఎమోషన్, ఆధ్యాత్మికత, శక్తి ప్రదర్శన ఉండటం వల్లే ఈ జోడీకి ప్రత్యేక ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. ఇటువంటి భారీ అంచనాల నడుమ ఈసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం అఖండ- 2 తాండవం. 2021లో వచ్చిన అఖండ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే సెన్సార్, కాపీ అవుట్, ఫార్మాలిటీలు సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. డిసెంబర్ 5న తెలుగు సహా 6 భాషల్లో భారీగా విడుదలకు సిద్ధం కాగా, ఇవాళ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు కూడా ప్లాన్ చేశారు.
కానీ విడుదలకి కొన్ని గంటల ముందు ఈ సినిమాకు ఊహించని అడ్డంకి ఎదురైంది. విడుదల నిలిపివేయాలని ఈరోస్ ఇంటర్నేషనల్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించడంతో పెద్ద వివాదం రేగింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తమకు రూ.28 కోట్లు బాకీగా ఉన్నాయని, అదే సంస్థ ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ పేరుతో సినిమా నిర్మాణం కొనసాగిస్తూ ఉన్నందున, ఈ బాకీలు చెల్లించేవరకు ‘అఖండ 2’ విడుదలను ఆపాలని ఈరోస్ కోర్టును కోరింది. విచారణ అనంతరం కోర్టు ఈరోస్ పిటిషన్‌ను సమర్థించినట్లు తెలుస్తోంది. దీంతో ‘అఖండ 2 తాండవం’ విడుదలపై తాత్కాలికంగా అనిశ్చితి నెలకొంది.
ఈ వివాదం వెనకాల ఉన్న కథ కూడా ఆసక్తికరంగానే ఉంది. గతంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 14 రీల్స్‌తో కలిసి మహేష్ బాబు హీరోగా వచ్చిన 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాలను నిర్మించింది. అయితే అవి బాక్సాఫీస్ వద్ద విఫలమవడంతో భారీ నష్టాలు చవిచూశారని సమాచారం. నిర్మాతలైన రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర ఆ తర్వాత విడిపోయి 14 రీల్స్ ప్లస్ పేరిట కొత్త బ్యానర్‌తో సినిమాలు నిర్మించడం ప్రారంభించారు. అదే బ్యానర్ ఇప్పుడు అఖండ సీక్వెల్‌ను రూపొందిస్తోంది.
ఈరోస్ మాత్రం తమకున్న బాకీలు తీర్చకుండా 14 రీల్స్ ప్లస్ భారీ ప్రాజెక్టులు చేయడం అన్యాయం అని వాదిస్తోంది. కోర్టు తీర్పుతో ఇప్పుడు అఖండ 2 అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అన్నది టీమ్‌తో పాటు ఫ్యాన్స్‌లో పెద్ద చర్చగా మారింది. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నప్పటికీ, లీగల్ సమస్య చిత్రం ప్రయాణాన్ని తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది. చివరికి ఈ వివాదం ఎలా పరిష్కారమవుతుంది, కొత్త విడుదల తేదీ వస్తుందా లేదా అన్నది మరికొన్ని గంటల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది.
ALSO READ: SHOCKING: ప్రియుడితో శృంగారం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి!..




