
HI ALERT: తెలంగాణ మొత్తం ప్రస్తుతం తీవ్రమైన చలి దెబ్బతో వణికిపోతోంది. తెల్లవారుజామునే కాదు.. సాయంత్రం మొదలైన వెంటనే చలిగాలులు బలంగా వీచుతుండటంతో ప్రజలు బయటికి వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో చలి ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తోంది. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తగ్గిపోవడం వల్ల చాలా జిల్లాల్లో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ముఖ్యంగా సాయంత్రం 6:30 గంటల తరువాత నుంచి ఉదయం 8 గంటల వరకు రహదారులపై దృశ్యం క్లియర్‌గా కనిపించకపోవడంతో వాహనదారులు జాగ్రత్తగా నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన గంగారెడ్డి అనే 60 ఏళ్ల వృద్ధుడు చలి తీవ్రతను తట్టుకోలేక మృతిచెందడం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ ఒకే ఘటన ప్రస్తుతం పరిస్థితులు ఎంత తీవ్రమయ్యాయో స్పష్టంగా తెలియజేస్తోంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే నాలుగు రోజుల పాటు చలి మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. డిసెంబర్ 10 నుంచి 13 వరకు రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గి, పొగమంచు ప్రభావం పెరుగుతుందని చెప్పారు. ఉత్తర తెలంగాణ జిల్లాలు ఇప్పటికే చలికి గడ్డకట్టినట్టుగా మారాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం ఈ సీజన్‌లో ఇప్పటివరకు అత్యల్పం.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వికారాబాద్, మంచిర్యాల, జగిత్యాల తదితర ఏరియాల్లో చలి దాదాపు రెండు వారాల పాటు కొనసాగుతుందని అంచనా. దక్షిణ తెలంగాణలో కూడా చలిగాలులు వస్తున్నాయి. ఈ నెల 16 వరకు చలి సమానంగా ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ చెబుతోంది.
హైదరాబాద్ నగరంలో కూడా రాబోయే రోజుల్లో చలి గట్టిగానే ఉంటుందని అంచనా. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 12 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లే ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు సూచించారు. వెచ్చటి దుస్తులు ధరించడం, వేడిగా ఉండే ఆహారం తీసుకోవడం, అవసరం లేకపోతే తెల్లవారుజాము, రాత్రి ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిదని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రజలు చలి దెబ్బకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, స్థానిక అధికారులు ఇచ్చే అలర్ట్‌లు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని, ఈ చలి వేవ్‌ను సురక్షితంగా ఎదుర్కోవాలని అధికారుల సూచన.
ALSO READ: వైరలవుతున్న తమన్నా, శ్రీలీలల బాత్రూం ఫోటోలు





