మహా కుంభ మేళాకు భక్తుల తాకిడి రోజురోజుకూ భారీగా పెరుగుతుంది. నేడు మాఘ పౌర్ణమి ఉండటంతో పాటు మేళా పూర్తి కావొస్తుండటంతో పుణ్య స్నానం చేసేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు. దీంతో 350 కిలో మీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రయాగ్‌రాజ్ ను… నో వెహికల్ జోన్’గా ప్రకటించారు. ఎమర్జెన్సీ, అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. ఈ మేరకు స్పెషల్ ట్రాఫిక్ ప్లాన్‌ను రూపొందించారు.
తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు గంగమ్మలో పతివ్ర స్నానాలు ఆచరిస్తున్నారు. మాఘ పౌర్ణమి వేళ త్రివేణీ సంగమానికి మూడు నుంచి నాలుగు కోట్ల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో భక్తులు, పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ స్నానాలు రోజంతా కొనసాగుతాయని, సుమారు 10 లక్షల మంది కల్పవాసీలు దీక్ష విరమిస్తారని చెప్పారు. కాగా, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులపై హెలికాప్టర్ ద్వారా పుష్ప వర్షం కురిపించారు.
మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్ లో ఏర్పాటు చేసిన పార్కింగ్ ఏరియాలన్నీ నిండిపోయాయి. మరిన్ని వెహికల్స్ ను సిటీలోకి అనుమతిస్తే నడుచుకుంటూ వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు తెలిపారు. సాధువులంతా తమకు కేటాయించిన నిర్ణీత సమయంలోనే స్నానం చేయాలని అధికారులు సూచించారు. పుణ్య స్నానం ఆచరించిన వెంటనే ఘాట్‌ను ఖాళీ చేయాలని కోరారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా.. వెంటనే వారిని హాస్పిటల్ కు తరలించేలా స్పెషల్ రూట్ ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని ప్రయాగ్‌రాజ్ వాసులకు అధికారులు సూచించారు. ఆన్ లైన్ మోడ్‌లోనే పాఠాలు బోధించాలని స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలకు అధికారులు ఆదేశించారు. కాగా, జబల్‌పూర్ – ప్రయాగ్‌రాజ్ రూట్లో సుమారు 350 కిలో మీటర్లకు పైగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్, సివనీ, కట్నీ, మైహర్, సాత్నా, రివా జిల్లాల్లో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 50 కిలో మీటర్ల జర్నీకి సుమారు 12 గంటలకు పైగా టైమ్ పడుతున్నది. సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
మహాకుంభమేళా ప్రారంభమై నేటికి 31 రోజులు అయ్యింది. జనవరి 13న ప్రారంభమైన మేళా.. మహాశివరాత్రితో ముగియనుంది. ఇప్పటివరకు 46.25 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని అధికారులు కుంభమేళా ప్రాంతంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. కుంభమేళాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు మాట్లాడుతూ జనం ఎటువంటి వదంతులను నమ్మవద్దని సూచించారు. పోలీసులు కుంభమేళా ప్రాంతంలో అడుగడునా ఉన్నారని, వారు ఎటువంటి వరిస్థితి తలెత్తినా వెంటనే నివారిస్తారన్నారు