
Telangana- AP Weather Forecast: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. పలు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ ఏర్పడి వానహనదారులు నరకయాతన అనుభవించారు.
తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు
ఇవాళ కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి. రోజంతా వానలు పడనున్నాయి. మధ్యాహ్నం 2 తర్వాత వర్షం జోరు పెరగనుంది. సాయంత్రం 6 గంటల వరకూ కురిసే అవకాశాలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మధ్యాహ్నం 2 నుంచి అర్థరాత్రి 2 వరకూ మోస్తరు వర్షం కురుస్తుంది. హైదరాబాద్ లో ఉదయం నుంచి మధ్యాహ్నం 1.30 వరకూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం హైదరాబాద్ పరిసరాల్లో కురుస్తుంది. 1.30 తర్వాత నుంచి 6 గంటల వరకు భారీ వర్షం పడుతుంది.
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
తెలంగాణలో రాగల మూడురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు యెల్లో అలెర్ట్ ను జారీ చేసింది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని తెలిపింది. ఇవాళ నల్లగొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.
ఏపీలోనూ వానలే వానలు
ఇక ఏపీలో ఉదయం ఉత్తరాంధ్ర సహా కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురుస్తాయి. మధ్యాహ్నం తర్వాత ఏపీ అంతటా జోరు వానలు అంతటా కురుస్తాయి. రాయలసీమలో సాయంత్రం 5 గంటల నుంచి భారీ వర్షం కురుస్తుంది. కోస్తాలో కూడా.. సాయంత్రం 5 నుంచి వర్షం ప్రారంభం అవుతుంది. ఉత్తరాంధ్రలో సాయంత్రం 3 నుంచి వర్షాలు పడుతాయి. అటు భారత వాతావరణ శాఖ ప్రకారం.. మరో 5 రోజులపాటూ.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానాం, కర్ణాటక, లక్షద్వీప్, తమిళనాడు, కేరళలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. అలాగే ఉరుములు, మెరుపుల సమస్య కూడా ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Read Also: హైదరాబాద్ ను ముంచెత్తిన భారీ వర్షం.. నీట మునిగిన పలు ప్రాంతాలు, వాహనదారుల నరకయాతన!