తెలంగాణ

భారీ వర్షాలతో హైదరాబాద్ చిత్తడి - గంటపాటు దంచికొట్టిన వాన

  • కుంభవృష్టితో మునిగిన భాగ్యనగరం

  • వానలతో వాహనదారుల అవస్థలు

  • ట్రాఫిక్ జామ్ లతో ప్రజల బేంబేలు

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ : చినుకు పడితే హైదరాబాద్‌ చిత్తడే… ఈ మాట నగరంలో వర్షం పడినప్పుడల్లా వాడేదే. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్‌లోని లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. అలాంటిది.. బుధవారం రాత్రి గట్టిగా గంటపాటు వర్షం కురిసింది. రాత్రి తొమ్మిదున్నర సమయంలో మొదలైన జోరువాన… పదిన్నర.. 11గంటల వరకు కుంభవృష్టిలా పడింది. ఇంకేముంది… సగరం హైదరాబాద్‌ దాదాపుగా మునిగిపోయింది. ఓ రోడ్డుపై చూసినా వర్షపు నీరు… కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌లు. పది, 11 గంటలకు ఇళ్లకు చేరాల్సిన వారు… అర్థరాత్రి వరకు రోడ్డుపైనే ఉండాల్సిన పరిస్థితి. ఆటోలు, క్యాబ్‌లు కూడా బుక్‌ కాలేదు. దీంతో ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరే వారు… ఒక రకంగా రోడ్డుపై నరకం చూశారు. గంట వర్షానికే హైదరాబాద్‌ ఇంతలా వణికితే… రెండు, మూడు గంటలు భారీ వర్షం పడితే.. పరిస్థితి ఏంటి…? ఎప్పుడైనా ఆలోచించారా…?

Read Also : కనకదుర్గమ్మ సాక్షిగా తప్పుడు కథనాలను ఖండించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి!

బుధవారం రాత్రి వర్షం పడితే… గురువారం ఉదయానికి కూడా చాలా కాలనీలో నీటిలో మునిగిపోయాయి. నగరం నడిబొడ్డులోని ప్రధాన ప్రాంతాలు కూడా నీట మునిగాయి. బేగంపేటలోని ప్యాట్నీ నగర్‌ జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇటీవల అక్కడి నాలా గోడను హైడ్రా కూల్చేసింది. దీంతో… నీటి ప్రవాహం కాలనీలను ముంచెత్తుతోందని స్థానికులు చెప్తున్నారు. ఇక బల్కంపేటలో వరద నీటిలో మునిగి ఓ యువకుడు మృతిచెందాడు. రాత్రి కురిసిన వర్షానికి బల్కంపేటలోని అండర్‌పాస్‌ బ్రిడ్జి దగ్గరకు భారీగా వరద నీరు చేరింది. బైక్‌పై ఆ మార్గంలో వెళ్లిన షరఫుద్దీన్‌ అనే యువకుడు వరద నీటిలో మునిగిపోయాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు.. అప్పటికే షరఫుద్దీన్‌ మృతిచెందాడు.

నిజంగా బుధవారం రాత్రి.. హైదరాబాద్‌ వాసులకు కాళరాత్రి అనే చెప్పాలి. ఆకాశానికి చిల్లుపడిందా… మేఘం బద్ధలైందా అన్నట్టు గంట… గంటన్నరపాటు వర్షం పడింది. ఆ వర్షానికి… వరద ముంచెత్తింది. నగరంలో వర్షపు నీరు చేరని రోడ్డు లేదు. అండర్‌ బ్రిడ్జ్‌లు, మెట్రో స్టేషన్లు… ఫ్లైవర్‌ కింద.. ఎటు చూసినా నీరే. ఆ వర్షపు నీటిలో వెళ్లడమంటే… వాహనదారులకు ఒక సాహసమనే చెప్పాలి. రోడ్లపై నీరు చేరింది. ఎంత లోతు నీరు ఉందో ఊహించే పరిస్థితి లేదు…. ఎక్కడ గుంత ఉందో కూడా కనిపించదు. ఒకవేళ.. నీటి కింద మ్యాన్‌ హోల్‌ తెరిచి ఉంటే… పరిస్థితి ఏంటి…? అన్న భయంతో బిక్కుబిక్కుమంటూ ఇళ్లకు చేరుకున్నారు వాహనదారులు.

Read Also : రాజగోపాల్ రెడ్డిపై సీఎం రేవంత్ పగ! మారిన RRR అలైన్ మెంట్

మొత్తానికి బుధవారం రాత్రి వరుణుడు హైదరాబాద్‌ను వణికించాడు. రోడ్లు కాలవలను తలపించాయి. డివైడర్ల మీద నుంచి వరద పొంగి పొర్లింది. ఓవైపు భారీ వర్షం.. మరోవైపు ట్రాఫిక్‌తో నగర ప్రజలు నరకం చూశారు. హైదరాబాద్‌లో 12 నుంచి 15 సెంటీమీటర్ల వరకు వర్షం పడింది. ఇటీవల కాలంలో ఇంతస్థాయిలో వర్షం పడటం ఇదే తొలిసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button