
Heavy Rains: ఏపీలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13వ తేదీన అల్పపీడనం ఏర్పడనున్నట్లు తెలిపింది. దీనికి ముందు ఈ ప్రాంతంలో ఆవర్తనం ఆవరించే అవకాశం ఉన్నట్లు వివరించింది. వీటి ప్రభావంతో కోస్తాలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈనెల 11 నుంచి 14 వరకు కోస్తాలో అక్కడక్కడ భారీవర్షాలు కురుస్తాయని వివరించింది.
రెండు రోజుల పాటు భారీ వర్షాలు
ఈ నెల 12 నుంచి 14 వరకు కోస్తాలో ఎక్కువ చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర పరిసరాలు, ఉత్తర కర్ణాటకల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు ఉన్నట్లు వెల్లడించారు. అటు శనివారం కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిశాయి. ఇవాళ రాయలసీమలో అనేక చోట్ల, కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. అటు చాలా రోజులుగా మధ్య భారతం, తర్వాత ఉత్తరాదిలో కొనసాగిన రుతుపవన ద్రోణి రెండు రోజుల్లో దక్షిణాది వైపు రానున్నది. దాని తూర్పుభాగం నాలుగైదు రోజులు దక్షిణాది వైపు కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో సౌత్ లోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. తెలంగాణ, కర్నాటక, తమిళనాడు, కేరళలో కూడా వర్షాలు పడుతాయని తెలిపింది. ఆయా రాష్ట్రాల్లోని ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించింది.
Read Also: మూడు రోజులు భారీ వర్షాలు, మళ్లీ సాగర్ గేట్లు ఓపెన్!