
Rains In Tealangana: కాస్త విరామం ప్రకటించిన వరుణ దేవుడు మళ్లీ డ్యూటీ ఎక్కాడు. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకావం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయింటే?
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం రుతుపవన ప్రభావంతో ఇవాళ(మంగళవారం) భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, వరంగల్ జిల్లాల్లో భారీగా వానలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇతర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులతో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
బుధవారం ఎక్కడెక్కడ వానలు పడుతాయంటే?
ఇక బుధవారం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాన పడే సమయంలో ప్రజలు బయటకు రాకూడదని సూచించింది. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు అలర్ట్ గా ఉంచాలని చెప్పింది. ముఖ్యంగా వర్షాలు పడే సమయంలో చెట్ల కిందికి వెళ్లకూడదని వివరించింది.