
తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం స్పష్టిస్తున్నాయి. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానకు పంటలు ధ్వంసం అవుతున్నాయి. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షం పడింది. ఉత్తర తెలంగాణలో భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు, వడగల్లు పడటంతో పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మొక్క జొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పెద్ద పెద్ద సైజులో వడగండ్లు పడటంతో మామాడి కాయలు రాలిపోయాయి. ఇప్పటికే సాగు నీరు లేక వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోగా.. ఇప్పుడు రాళ్ల వానతో కాపుకు వచ్చిన పంటలు ధ్వంసం అయ్యాయి. దీంతో తమను ఆదుకోవాలని అన్నదాతలు లబోదిబో అంటున్నారు.
బలమైన ఈదురుగాలులకు పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగి మురుగు నీళ్లు రోడ్లపై పారాయి. కొన్ని ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అకాల వర్షం నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా అలర్ట్ ప్రకటించింది. మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
హైదరాబాద్‌లో అర్థరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. కూకట్ పల్లి, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి, మూసాపేట, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి ఏరియాలతో భారీ వర్షం పడింది. గత కొన్ని రోజులుగా నగరంలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నారు. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు ఉక్కపోత.. మరోవైపు చెమటతో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో నగర వాసులు ఉపశపనం పొందుతున్నారు.