Tirumala Rush: వైకుంఠ ఏకాదశి, న్యూఇయర్ వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. వైకుంఠ ద్వార దర్శనం కోసం వేలాదిగా భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఇవాళ్టి నుంచి సర్వదర్శనానికి తిరిగి అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో, ముందుగానే పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు రావడంతో రద్దీ భారీగా పెరిగింది. సామాన్య భక్తులతో పాటు వీఐపీలు కూడా తిరుమలకు భారీగా తరలి వచ్చి కలియుగ వైకుంఠనాథుడు వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటన్నారు.
భారీగా ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు
ఈ నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. టీటీడీ అధికారుల అంచనాలకు మించి భక్తులు చేరుకోవడంతో, ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైన్ నుంచి భక్తులను క్రమబద్ధంగా లోపలి క్యూ లైన్లలోకి అనుమతిస్తున్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, ఆహారం, భద్రతా ఏర్పాట్లు పటిష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం
క్యూ లైన్లలో నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తూ, భక్తుల కదలికలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వైకుంఠ ద్వార దర్శనం, సర్వదర్శనం ప్రారంభం కారణంగా వచ్చే కొన్ని రోజులు తిరుమలలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు తెలిపారు. శ్రీవారి దర్శనం దృష్ట్యా భక్తులు సహనం పాటించాలని సూచించారు. టీటీడీ అధికారుల సూచనలను పాటించి తమకు సహకరించాలని కోరారు. భక్తులు భారీగా తరలి వస్తుండటంతో శ్రీవారి దర్శనానికి ఆలస్యమవుతోందని టీటీడీ అధికారులు తెలిపారు.





