
అగ్రరాజ్యం అమెరికాలో వరదలు బీభత్సం స్పష్టిస్తున్నాయి. టెక్సాస్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించి పలు నివాస ప్రాంతాలను నీటముంచాయి. ఈ వరద విలయంతో ఇప్పటివరకు 43 మంది చనిపోయారని సమాచారం. మరో 20 మందికి పైగా గల్లంతయ్యారని తెలుస్తోంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీం తీవ్రంగా గాలిస్తోంది.
వర్షాల కారణంగా టెక్సాస్ రాష్ట్రంలో ని హంట్ ప్రాంతంలోని గ్వాడాలుపే నది ఉప్పొంగుతోంది. వరదలతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరదల కారణంగా పలు ఇళ్ళు నీట మునిగాయి. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో రోడ్డుపై పార్క్ చేసిన కార్లు నీటితో కొట్టుకుపోయాయి. ఆకస్మిక వరదలే ఇందుకు కారణమని, కనీసం ఆస్తులు కాపాడుకునే అవకాశం కూడా దక్కలేదంటున్నారు అక్కడి ప్రజలు.
వరదప్రవాహక ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా వుంది. ప్రజలను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు అధికారులు. వరదల్లో చిక్కుకున్న దాదాపు 800 మందికి పైగా ప్రజలను రక్షించారు. అయితే గ్వాడాలుపే నదీ తీరంలో ఉన్న క్రిస్టియన్ క్యాంప్‌లో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ క్యాంప్‌ను వరదలు ముంచెత్తడంతో ఇందులో దాదాపు 23-25 మంది పిల్లలు గల్లంతయ్యారు. ఫలితంగా ఈ బాలికల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారి ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తున్నారు. మరోవైపు, బాలికల కోసం అధికారులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలిస్తున్నారు.