
Health: వంకాయలను మనం సాధారణంగా ప్రతిరోజూ వండే కూరగాయగా చూస్తాము. కానీ ఈ చిన్న కూరగాయ లోపల ఎన్నో పోషక రహస్యాలు దాగి ఉంటాయి. శరీరానికి కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉండే వంకాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే దీనిని ఎలా తింటున్నాం, ఏ పదార్థాలతో కలిపి తింటున్నాం, మన శరీరం ఏ సమస్యలతో బాధపడుతోంది వంటి విషయాలపై ఆధారపడి వంకాయ ప్రయోజనమా, హానికరమా అన్నది నిర్ణయించబడుతుంది. పోషకాల పరంగా మంచి విలువ ఉన్నా, కొందరికీ వంకాయలు ప్రమాదకర ప్రభావాలు చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వంకాయలలో ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి శ్రేణిలోని పుష్కలమైన పోషకాలు, బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు వంటి శరీరాన్ని రక్షించే పదార్థాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉండడంతో కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. భోజనం ఎక్కువ తినకుండా నియంత్రణలో ఉంచుతుంది. ఇది బరువు తగ్గడం లేదా బరువు నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా వంకాయలో ఉండే పోషకాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి డయాబెటిస్ సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.
అయితే వంకాయను ఏ పదార్థాలతో కలిపి తింటున్నాం అన్నది కూడా చాలా ముఖ్యం. పాలు, వంకాయలు శరీరంలో పూర్తిగా విభిన్న స్వభావాలు కలిగి ఉండటం వల్ల ఈ రెండింటినీ తక్కువ వ్యవధిలో తీసుకోవడం జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పాలు జీర్ణం కావడానికి తీసుకునే సమయం, వంకాయ జీర్ణం అయ్యే విధానం రెండూ వ్యతిరేకంగా ఉండటం వల్ల మలబద్ధకం, కడుపు నొప్పి, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వంకాయ కూర తిన్న వెంటనే పాలు తాగితే శరీరం అసౌకర్యానికి లోనవుతుంది.
ఇదే విధంగా పెరుగు చల్లదనం ఇవ్వగా, వంకాయలు వేడి స్వభావం కలిగి ఉండటం వల్ల ఈ రెండింటిని కలిపి తినడం ద్వారా కొందరికి కడుపు సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇందులో శాస్త్రీయ ఆధారాలు పూర్తిగా అందుబాటులో లేకపోయినా, కొన్ని పరిశోధనలు దీనిని నివారించాలని సూచిస్తున్నాయి.
భోజనం తర్వాత టీ తాగడం అలవాటు ఉన్నవారు టీకి ఉన్న టానిన్ వంకాయలోని ఇనుము శోషణను అడ్డుకుంటుందని గుర్తించాలి. శరీరానికి అవసరమైన ఇనుము గ్రహించబడకపోవడం వల్ల రక్తహీనత సమస్య వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు, మహిళలు వెంటనే టీ తాగకూడదు.
మాంసం జీర్ణమయ్యే ప్రక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. వంకాయలో ఉన్న అధిక ఫైబర్ కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఈ రెండింటినీ ఒకేసారి తింటే జీర్ణక్రియ చాలా నెమ్మదించి అజీర్ణం, గ్యాస్, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఇకపోతే.. వంకాయను ఎవరు తినకూడదనే విషయానికి వస్తే రక్తహీనతతో బాధపడేవారికి వంకాయ భారంగా మారే అవకాశం ఉంది. శరీరంలో ఇనుము శోషణను తగ్గించే గుణం ఉండటం వల్ల అనేమియా సమస్య మరింత పెరుగుతుంది. అదేవిధంగా కొందరికి వంకాయలపై అలెర్జీ ఉండవచ్చు. చర్మంపై దద్దుర్లు, వాపు, శ్వాస సంబంధిత సమస్యలు కనిపించవచ్చు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు వంకాయలో ఉండే కొన్ని రసాయనాల వల్ల రాళ్ల సమస్య మరింత పెరుగుతుంది. కళ్లలో మంట, చికాకు, వాపు వంటి సమస్యలు ఉన్నవారు కూడా వంకాయలను దూరంగా ఉంచాలి. మూలవ్యాధితో బాధపడుతున్నవారు వంకాయ తింటే సమస్యలు మరింత తీవ్రమవుతాయని వైద్యులు చెబుతున్నారు.
ఈ కారణాలన్నింటిని పరిగణనలోకి తీసుకొని వంకాయలను ఎప్పుడు, ఎలా, ఎవరెవరికి ఇవ్వాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ప్రతి వ్యక్తి శరీర పరిస్థితులు వేర్వేరు కాబట్టి, మీ ఆరోగ్యస్థితిని బట్టి వంకాయలను ఆహారంలో చేర్చడం మంచిది.





