
కర్ణాటకలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. కన్నవారినే కాదు, కన్న చెల్లెలినీ కడతేర్చిన ఓ అన్న ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి రావడం అందరినీ షాక్‌కు గురి చేసింది. విజయనగర జిల్లా కొట్టూరులో జరిగిన ఈ త్రిపుల్ మర్డర్ కేసు వెనుక ఉన్న భయానక నిజాలు వెలుగుచూసిన తీరు పోలీసులకే వణుకు పుట్టిస్తోంది.
చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా కిట్టిహళ్లికి చెందిన అక్షయ్‌కుమార్ (24) యువకుడు రెండేళ్ల క్రితం జీవనోపాధి కోసం కొట్టూరుకు వచ్చాడు. అక్కడే తల్లిదండ్రులు జయలక్ష్మీ (45) భీమరాజ్ (50) సోదరి అమృత (17)తో కలిసి నివసిస్తూ స్థానికంగా టైర్ల దుకాణం నిర్వహిస్తున్నాడు. బయటకు సాధారణ కుటుంబంగా కనిపించిన ఈ ఇంట్లోనే భయంకరమైన నేరం జరిగిందన్న విషయం ఎవ్వరూ ఊహించలేదు.
ఈ నెల 27న అక్షయ్‌కుమార్ తన తల్లిదండ్రులు, చెల్లెలిని అతి కిరాతకంగా హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత శవాలను ఇంట్లోనే పూడ్చిపెట్టినట్లు పోలీసులు నిర్ధారించారు. అనంతరం ఎలాంటి అనుమానం రాకుండా గురువారం బెంగళూరుకు వెళ్లిన నిందితుడు.. అక్కడి తిలక్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో తన తల్లిదండ్రులు, సోదరి అదృశ్యమయ్యారని ఫిర్యాదు చేయడం ఈ కేసులో కీలక మలుపుగా మారింది.
ఫిర్యాదు సమయంలో అక్షయ్‌కుమార్ ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. కఠిన విచారణలో నిజాలు బయటపడగా, ముగ్గురినీ తానే హత్య చేసినట్లు అక్షయ్‌కుమార్ అంగీకరించాడు. వెంటనే బెంగళూరు పోలీసులు కొట్టూరు పోలీసులకు సమాచారం అందించి, నిందితుడిని వారి కస్టడీకి అప్పగించారు.
అదే రోజు రాత్రి అక్షయ్‌కుమార్‌ను కొట్టూరుకు తీసుకువచ్చిన పోలీసులు ఇంటిని పరిశీలించగా, పూడ్చిపెట్టిన శవాలు బయటపడ్డాయి. విజయనగర జిల్లా ఎస్పీ జాహ్నవి, డీఎస్పీ మల్లేశ్ దొడ్డమని ఘటనా స్థలాన్ని స్వయంగా సందర్శించి వివరాలు సేకరించారు. ఈ త్రిపుల్ మర్డర్ వెనుక కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని ఎస్పీ జాహ్నవి వెల్లడించారు. ఈ కేసులో పూర్తి నిజాలు బయటపడితేనే హత్యలకు గల అసలు కారణాలు స్పష్టమయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
ALSO READ: మహిళతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన నేత.. చెప్పుతో కొట్టిన భర్త





