కాంగ్రెస్ పార్టీతో 2019లో ఏర్పడిన కూటమి చివరికి విడాకులతో ముగిసిందని, దానికి కారణం ఆ సంబంధంలో ఎదురైన రాజకీయ వేధింపులేనని మాజీ ప్రధానమంత్రి, జనతా దళ్ (సెక్యులర్) నేత దేవెగౌడ వ్యాఖ్యానించారు. రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేరే ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా సమాధానం ఇచ్చారు.
మాతో ప్రేమ.. వారితో పెళ్లి..
రాజ్యసభలో వీడ్కోలు సమావేశం సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, తాను దేవెగౌడను 54 ఏళ్లుగా తెలుసునని చెప్పారు. గతంలో ఆయన కాంగ్రెస్‌తో ప్రేమలో ఉండి ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్న బీజేపీని పెళ్లి చేసుకున్నారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
ప్రేమకాదు, బలవంతపు పెళ్లి!
ఈ వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ దేవెగౌడ తన సోషల్ మీడియా పోస్టులో స్పష్టత ఇచ్చారు. ఖర్గే మాట్లాడిన సమయంలో తాను పార్లమెంటులో లేనని తెలిపారు. అదే భాషలో సమాధానం ఇస్తూ, కాంగ్రెస్‌తో తమది బలవంతపు పెళ్లి లాంటిదన్నారు. ఆ సంబంధంలో ఎదురైన రాజకీయ పరిస్థితులు, వేధింపుల కారణంగానే ఆ కూటమి చివరికి విడిపోయిందని చెప్పుకొచ్చారు.
2018లో ఏం జరిగింది?
2018లో కర్ణాటకలో జరిగిన రాజకీయ పరిణామాలను కూడా ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్‌ను పార్టీ పంపి, తన కుమారుడు కుమారస్వామిని ముఖ్యమంత్రిగా చేయాలని కాంగ్రెస్ నాయకత్వం ప్రతిపాదించిందని తెలిపారు. తాను ఖర్గే ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నానని దేవెగౌడ చెప్పారు. ఆ సమయంలో సిద్ద రామయ్య కూడా అక్కడే ఉన్నారని ఆయన గుర్తుచేశారు. కానీ, చివరికి కుమారస్వామి నేతృత్వంలో కర్ణాటకలో కాంగ్రెస్–జేడీఎస్ కూటమి ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు. అయితే 2019లో కొన్ని ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కారణంగా ఆ ప్రభుత్వం కుప్పకూలిందని దేవెగౌడ వివరించారు. ఆ సంఘటనలే కాంగ్రెస్‌తో తమ పొత్తు విచ్ఛిన్నానికి దారితీశాయన్నారు.
ఫిరాయింపులపై చర్యలు తీసుకుని ఉంటే..
అప్పట్లో ఫిరాయింపులను ప్రోత్సహించిన వారిపై కాంగ్రెస్ పార్టీ కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని దేవెగౌడ అభిప్రాయపడ్డారు. అలా జరిగి ఉంటే ఖర్గే ఇవాళ మరింత మంచి రాజకీయ స్థితిలో ఉండేవారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్–జేడీఎస్ మధ్య గత రాజకీయ సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది.
