
వైఎస్ షర్మిల.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అన్న వైఎస్ జగన్‌తో విభేదించి… ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరి.. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవి చేపట్టింది. ఎన్నికల ముందు కాస్త హడావుడి చేసినా… ప్రయోజనం లేకుండా పోయింది పాపం. ఇప్పుడు.. ఆమె తలపై మరో గుదిబండ పడింది. షర్మిల తీరును సొంత జిల్లా నేతలే తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. అసలు ఏపీ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది…? షర్మిలపై వ్యతిరేకత ఎందుకు పెరుగుతోంది…?
వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత… కొంత మంది కడప జిల్లా వైసీపీ నేతలు.. కాంగ్రెస్‌లో చేరారు. వాళ్లే ఇప్పుడు… ఆ పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. రాజీనామాలు చేస్తూ.. షర్మిల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో.. వైఎస్ షర్మిలకు సొంత జిల్లాలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. వైసీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కడప జిల్లా నాయకుడు అఫ్జల్‌ఖాన్… గత ఎన్నికల్లో కడప అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. 24వేల ఓట్లు సాధించారు. ఇప్పుడు… పార్టీ అధ్యక్షురాలు తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు. షర్మిల.. పార్టీ బాగోగులు పక్కన పడేసి.. వ్యక్తిగత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారన్నది ఆయన ఆరోపణ. అందుకే కాంగ్రెస్‌ను వీడుతున్నట్టు చెప్పారాయన. ఆయితే… ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు..? నెక్ట్స్ స్టెప్ ఏంటి..? అన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
Also Read : టీడీపీకి కొరకరాని కొయ్యలా కొలికపూడి – వాట్ నెక్ట్స్..!
గత ఎన్నికల్లో అఫ్జల్‌ఖాన్ కాంగ్రెస్ తరపున పోటీ చేయడం వల్ల.. ముస్లింల ఓట్లు చీలిపోయాయని సమాచారం. ఓట్లు చీలడం వల్ల… కంచుకోట అయిన కడపలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలిందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అంటే… వైసీపీ ఓడిపోవడానికి అఫ్జల్‌ఖాన్ కూడా కారణమనే చెప్పాలి. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన అఫ్జల్‌ఖాన్.. మళ్లీ వైసీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం.