తెలంగాణలో సంచలనమైన ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావుకు అమెరికాలో గ్రీన్‌కార్డు మంజూరైనట్లు సమాచారం. అమెరికాలోనే సెటిల్ అయిన ఆయన కుటుంబ సభ్యుల స్పాన్సర్‌షిప్‌తో ప్రభాకర్‌రావుకు తాజాగా గ్రీన్‌కార్డు మంజూరైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామం కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అంశంగా మారింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో టి.ప్రభాకర్‌రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇదే కేసులో ఇప్పటి వరకూ నలుగురు పోలీసు అధికారులను అరెస్ట్ చేశారు. మరో వైపు అమెరికాలో ఉన్న ఆయన్ను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.ఈ విషయమై ఆయనకు మెయిల్ ద్వారా నోటీసులు కూడా పంపారు.ప్రభాకర్ రావును అమెరికా నుంచి తీసుకొచ్చి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైందని.. ప్రభాకర్ రావును ప్రశ్నిస్తే కీలక విషయాలు వెలుగులోనికి వస్తాయని.. బడా నేత అరెస్ట్ ఖాయమనే ప్రచారం సాగింది. దీపావళికి ముందే కీలక పరిణామాలు జరుగుతాయనే చర్చ కూడా సాగింది. దీపావళికి పేలే అతిపెద్ద బాంబ్ ఇదేనన్న వాదన కూడా వచ్చింది.
తాజాగా ప్రభాకర్ రావుకు గ్రీన్ కార్డు లభించిందన్న సమాచారంతో తెలంగాణ పోలీసులు అవాక్కయ్యారని తెలుస్తోంది. గ్రీన్ కార్డు వస్తే ప్రభాకర్ రావును అమెరికా నుంచి తీసుకురావడం అంత ఈజీ కాదు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసు ఆటకెక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.