గ్రామ ప్రగతికి వల్లంల అడుగులు..
యరుగండ్లపల్లిలో పలు శాఖల సిబ్బందితో గ్రామసభ
వేసవి నీటి ఎద్దడికి చెక్.. పైప్ లైన్ పనులు ప్రారంభం.
గ్రామ సభలో అధికారులతో కలిసి ప్రణాళికలు సిద్ధం.
సర్పంచ్ సంతోష్ యాదవ్
మర్రిగూడ (క్రైమ్ మిర్రర్): పల్లె ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే, గ్రామం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, యరుగండ్లపల్లి గ్రామ సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ అన్నారు. శనివారం మర్రిగూడ మండల పరిధిలోని, యరుగండ్లపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించిన, గ్రామసభలో ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై, వివిధ శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
సమస్యల గుర్తింపు – తక్షణ పరిష్కార మార్గాలు
గ్రామ సభలో ప్రధానంగా మూడు అంశాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులు దృష్టి సారించారు. మోరీల పూడికతీత, చెత్త సేకరణ బ్లీచింగ్ పౌడర్ చల్లడం, వంటి పనులను నిరంతరం పర్యవేక్షించాలని పంచాయతీ సిబ్బందిని ఆయన ఆదేశించారు. గ్రామంలో చీకటి లేకుండా ఉండేందుకు, పాడైపోయిన ఎల్ఈడి బల్బుల స్థానంలో, కొత్తవి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఎండలు ముదురుతున్న నేపథ్యంలో, గ్రామస్థులకు నీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రామసభ అనంతరం, నీటి ఎద్దడి తలెత్తకుండా నూతనంగా పైప్ లైన్ పనులకు, సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి చేరాలనే లక్ష్యంతో, సాంకేతిక లోపాలున్న చోట మరమ్మతులు చేపట్టి, కొత్త కనెక్షన్లు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

తాగునీటి సరఫరాలో ఎటువంటి అవాంతరాలు కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పంచాయతీ సెక్రటరీ శ్రవణ్ గ్రామ నిధుల వినియోగం, అభివృద్ధి పనుల పురోగతిని వివరించారు. గ్రామంలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను కూడా సర్పంచ్ దృష్టికి తీసుకురాగా, వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. అభివృద్ధి అనేది కేవలం నిధులతోనే సాధ్యం కాదు, గ్రామస్థులందరి సహకారం ఉంటేనే యరుగండ్లపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోగలమని, ప్రతి సమస్యను తన ద్రుష్టికి తీసుకురావాలని సర్పంచ్ కోరారు.
ఈ సభలో ఉప సర్పంచ్ కృష్ణమ్మ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు దాదె సుమలత, ముద్దం వెంకటయ్య, ఉప్పునూతల అబ్బయ్య, ఐతగోని జయమ్మ, వల్లంల యాదయ్య, గుడ్ల రజిత, అందుగుల శ్రీనివాస్, పల్లేటి వెంకటయ్య, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల వివోఏలు, సంఘం అధ్యక్షురాళ్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
