
Bharat Brand Rice: తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం పేద, మధ్య తరగతి ప్రజలకు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బియ్యం ధరల నియంత్రణ కోసం FCI దగ్గర ఉన్న సుమారు 202 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అమ్మకానికి రెడీ చేసింది. కేంద్ర మంత్రివర్గ ఆమోదంతో ఆహార, ప్రజాపంపిణీ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ‘భారత్ బ్రాండ్’ పేరుతో ఈ బియ్యం అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క్వింటాలు బియ్యం ధర రూ.2,250గా నిర్ణయించింది.
ఈ-టెండర్ విధానంలో బియ్యం కేటాయింపులు
ఇక ఈ బియ్యాన్ని ప్రైవేటు సంస్థలు, సహకార సంఘాలు, సహకార సమాఖ్యలకు ఈ-టెండర్ విధానంలో విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. 25 శాతం నూకలతో ఈ బియ్యం విక్రయిస్తారు. 10 శాతం నూకలతో ఉన్న 50 లక్షల మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ ను ప్రైవేటు సంస్థలకు, రైస్‌మిల్లింగ్ ట్రాన్స్ ఫర్మేషన్ పథకం కింద ఉత్పత్తి చేసిన 7.5 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రైవేటు పార్టీలకు ఈ-వేలం ద్వారా విక్రయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు, అనుబంధ సంస్థలకు టెండర్లతో సంబంధంలేకుండా నేరుగా విక్రయించాలని నిర్ణయించారు. వీటికి ఇప్పటివరకు విక్రయించిన బియ్యంతో కలిపి ఈ ఏడాది అక్టోబరు 31 వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు, కమ్యూనిటీ కిచెన్లకు నవంబరు ఒకటో తేదీ నుంచి 2026 జూన్ 30 తేదీ వరకు 32 లక్షల టన్నుల బియ్యాన్ని కేంద్రం విక్రయించనుంది. నాఫెడ్, ఎన్‌సీసీఎఫ్, కేంద్రియ భండార్ లాంటి సహకారసంస్థలు, రిటైల్ స్టోర్స్, మొబైల్ వ్యాన్లు, ఈ- కామర్స్, పెద్ద రిటైల్ చైన్ సిస్టమ్ ద్వారా ‘భారత్ బ్రాండ్’ పేరుతో బియ్యం విక్రయించవచ్చని కేంద్రం వెల్లడించింది. వీటికి త్వరలోనే బియ్యం కేటాయింపులు జరపనుంది.
Read Also: రైతులకు తీపికబురు, రేపే రైతుల అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు!