
మహాలక్ష్మి పథకం అమలుతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ లాభాల బాట పట్టిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రభుత్వ ఆవిర్భావం తర్వాత ఆర్టీసీ పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని స్పష్టం చేశారు. ఆదివారం ప్రజా భవన్‌లో ఆర్టీసీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే మహాలక్ష్మి పథకం సామాజికంగా, ఆర్థికంగా పెద్ద మార్పుకు నాంది పలుకుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మహిళా ప్రయాణికుల ఉచిత ప్రయాణాలకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడానికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో ఒప్పందం చేసుకోవాలని అధికారులకు సూచించారు. తెలంగాణలోని ప్రతి మహిళకు ఈ కార్డులు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళా సాధికారత దిశగా రాష్ట్రం ముందడుగు వేస్తోందని, ఇప్పటికే ఈ పథకం కింద 255 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదు కావడం దీని విజయానికి నిదర్శనమని చెప్పారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీకి సంబంధించిన ఆర్థిక భారాన్ని క్రమంగా తగ్గించామని ఉప ముఖ్యమంత్రి వివరించారు. గతంలో రూ.1400 కోట్లుగా ఉన్న ఆర్టీసీ పీఎఫ్ బకాయిలను రూ.660 కోట్లకు తగ్గించామని, అలాగే సీసీఎస్ బకాయిలను రూ.600 కోట్ల నుంచి రూ.373 కోట్లకు తగ్గించినట్లు తెలిపారు. ఇది ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనమని అన్నారు. ఆర్టీసీ బలోపేతం, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు.
పీఎం ఈ డ్రైవ్ పథకం కింద హైదరాబాద్ నగరానికి 2800 ఎలక్ట్రిక్ బస్సులు, నిజామాబాద్ మరియు వరంగల్ పట్టణాలకు 100 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ బస్సుల నిర్వహణకు అవసరమైన చార్జింగ్ స్టేషన్లు, మౌలిక వసతులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణహిత రవాణా వ్యవస్థ దిశగా తెలంగాణ ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
విద్య రంగంపై కూడా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు యూనిఫామ్‌లు, పుస్తకాలు, షూస్ పంపిణీ అయ్యేలా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నాయి బ్రాహ్మణ, రజక కుల వృత్తుల సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ బిల్లులను క్రమం తప్పకుండా విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా రాష్ట్రంలో 100 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేసి కార్పొరేట్ స్థాయి భవనాల నిర్మాణాన్ని ప్రారంభించామని భట్టి విక్రమార్క తెలిపారు. గురుకులాల్లో విద్యార్థుల భోజనం, వసతి సౌకర్యాల కోసం మెస్ చార్జీలు, కాస్మొటిక్ చార్జీల కింద రూ.152 కోట్లను విడుదల చేసినట్లు వెల్లడించారు. ఈ చర్యలన్నీ ప్రజా ప్రభుత్వం విద్యా రంగానికి ఇస్తున్న ప్రాధాన్యతను చాటుతున్నాయని అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ప్రత్యేక ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ALSO READ: Murder: ‘నాకు పుట్టలేదు’ అంటూ మూడేళ్ల కొడుకుపై కిరాతకం





