తెలంగాణరాజకీయం

రేషన్‌కార్డు దారులకు GOOD NEWS

తెలంగాణలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతున్నాయి.

తెలంగాణలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపుతున్నాయి. ఇప్పటికే రేషన్ వ్యవస్థలో సన్నబియ్యం పంపిణీ ద్వారా ప్రజల నుంచి మంచి స్పందన పొందిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేయాలని భావిస్తోంది. రేషన్‌లో బియ్యంతోపాటు మరిన్ని నిత్యవసరాలను చేర్చే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం కొత్త రేషన్ పాలసీని తీసుకురాబోతున్నట్లు మంత్రి స్వయంగా ప్రకటించడం రాజకీయంగా కీలకంగా మారింది.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థులు భారీగా విజయం సాధించడంతో ప్రభుత్వం ఆత్మవిశ్వాసంతో ఉంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ ప్రభావం కనిపించినప్పటికీ.. మొత్తంగా కాంగ్రెస్ పట్టు కొనసాగిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత దగ్గర కావాలనే వ్యూహంతో సంక్షేమ పథకాల అమలును మరింత విస్తరించాలని కాంగ్రెస్ భావిస్తోంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా పనిచేస్తుందనే ఆశతో ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం రేషన్‌లో ఇస్తున్న సన్నబియ్యం పథకంపై ప్రజల నుంచి అనుకూల స్పందన రావడం ప్రభుత్వానికి పెద్ద బలంగా మారింది. దీనికి తోడు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, రూ.500కే వంటగ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రజల్లో సానుకూల భావనను పెంచాయి. ఈ పాజిటివ్ మూడ్‌ను కొనసాగించేందుకే రేషన్‌లో మరిన్ని సరుకులు ఇవ్వాలనే ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన ప్రకారం.. రేషన్‌లో బియ్యంతో పాటు పంచదార, గోధుమలు వంటి మొత్తం 5 రకాల నిత్యవసరాలను అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇది అమలులోకి వస్తే పేద కుటుంబాలకు పెద్ద ఊరట లభిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో నిత్యవసరాల ధరలు గణనీయంగా పెరిగాయి. కూరగాయల ధరలు కూడా సామాన్యుడికి అందని స్థాయికి చేరుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రేషన్ ద్వారా గోధుమలు, పంచదార, జొన్నలు, రాగులు లేదా కందిపప్పు, చింతపండు వంటి సరుకులు అందిస్తే పేదల ఆహార భద్రతకు భరోసా కలుగుతుందని భావిస్తున్నారు.

అయితే ఈ సంక్షేమ పథకాల అమలుకు భారీగా నిధులు ఖర్చవుతున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. అప్పులు పెరుగుతున్నాయనే ఆరోపణలకు ప్రభుత్వం సమాధానం చెబుతోంది. తాము కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అప్పుల పరిమితిని దాటలేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్లుగా హద్దులు మించి అప్పులు చేయడం లేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. వచ్చే ప్రతి రూపాయినీ ప్రజల సంక్షేమానికే వినియోగిస్తున్నామని చెబుతూ, దీర్ఘకాలంలో ఈ పథకాలే రాష్ట్రానికి మేలు చేస్తాయని ప్రభుత్వ వాదన.

ఇదిలా ఉండగా, రైతు వర్గాల్లో మాత్రం కొంత అసంతృప్తి కొనసాగుతోంది. రైతు భరోసా పథకం అమలులో ఆలస్యం జరుగుతోందని, ముఖ్యంగా రబీ సీజన్‌కు సంబంధించిన సాయం ఇంకా అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో కూడా డబ్బు వెంటనే ఇవ్వకపోవడం, బోనస్ ఆలస్యం కావడం వంటి అంశాలు రైతుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నాయి.

ప్రభుత్వం మాత్రం తెలంగాణలో ధాన్యం దిగుబడి పెరుగుతోందని, దేశంలోనే అత్యధికంగా ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోందని చెబుతోంది. తమ పాలనలోనే రైతులు ఎక్కువ సంతృప్తిగా ఉన్నారని ప్రభుత్వం పేర్కొంటోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యాయి. ఈ కాలంలో జరిగిన పలు ఎన్నికల్లో కాంగ్రెస్ వరుస విజయాలు సాధించడంతో, తమ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ పాలనకు రోజులు దగ్గరపడుతున్నాయంటూ విమర్శలు చేస్తోంది. ఇటీవల కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కాంగ్రెస్ పాలనకు రిఫరెండంగా పేర్కొన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో బీఆర్ఎస్ శిబిరంలో నిరాశ నెలకొంది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలే కాంగ్రెస్ పాలనకు అసలైన పరీక్ష అంటూ ప్రతిపక్షం వ్యాఖ్యానిస్తోంది.

పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌లో బియ్యంతో పాటు పంచదార, జొన్నలు, గోధుమలు, గోధుమపిండి, రాగులు ఇస్తున్నట్లు ప్రచారం ఉన్నా.. వాస్తవంలో చాలా చోట్ల పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని లబ్దిదారులు చెబుతున్నారు. ఈ లోపాలను గమనించకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు ఉన్నాయి. అదే పరిస్థితి తెలంగాణలో కూడా తలెత్తకుండా, ప్రభుత్వం ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు ప్రకటనలు చేసి, తర్వాత అమలు జరగకపోతే ప్రజల్లో ఆగ్రహం తప్పదని అంటున్నారు. అయితే ఈ హామీ ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి రావడం వల్ల ప్రజల్లో కొంత నమ్మకం ఏర్పడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేషన్ పాలసీ అమలు ఎలా ఉంటుందో, రాజకీయంగా ఇది ఎంతవరకూ ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.

ALSO READ: తెలుగు రాష్ట్రాల్లో వరుసగా 3 రోజులు సెలవులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button