
*ఉప్పొంగుతున్న గోదావరి..!!*
– మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పెరిగిన వరద ప్రవాహం
– పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తగా ఉండాలని అధికారుల సూచన
*క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి*
జయశంకర్ జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి గ్రామ పరిధిలోని మేడిగడ్డ బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో మహారాష్ట్రలోని ప్రాణహిత నది, తెలంగాణలోని గోదావరి నదులలో వరద ప్రవాహం గత రెండు రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తోంది.
సోమవారం వరకు బ్యారేజ్ ఇన్‌ఫ్లో 8,200 క్యూసెక్కులుగా ఉండగా, మంగళవారం అది 10,300 క్యూసెక్కులకు చేరింది. ఫలితంగా మేడిగడ్డ బ్యారేజ్ లో ఎనిమిది బ్లాక్‌లకు చెందిన మొత్తం 85 గేట్లను ఎత్తివేసి అధికారులు వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం బరాజ్ వద్ద నీటి మట్టం సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తులో ఉందని అధికారులు పేర్కొన్నారు.
*పరివాహక గ్రామాల ప్రజలకు హెచ్చరికలు*
వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుంటే, వచ్చే రోజుల్లో వరద మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని గ్రామాలు వరద ముప్పుకు లోనవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అంబటిపల్లి, పెద్దంపేట, లెంకలగడ్డ తదితర గ్రామాల ప్రజలకు ముందస్తు సూచనలు జారీ చేశారు. మేడిగడ్డ బరాజ్ గేట్లు పూర్తిగా ఎత్తివేయడం జరిగింది కనుక నది పక్కనకు వెళ్లకుండా ఉండాలని, ప్రత్యేకంగా జాలర్లు చేపల వేటకు వెళ్లరాదని విజ్ఞప్తి చేశారు. వరద ముంపు ప్రాంతాలవైపు వెళ్లడం పూర్తిగా నివారించాలని సూచించారు. అధికారుల సూచనల మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. భవిష్యత్‌లో మరింత వరద ఉధృతి పరిస్థితి దృష్ట్యా అధికారులు రెడ్ అలర్ట్ విధించారు.