
Ghost Dreams: మనుషులలో కలలు కనడం శరీరానికి, మనసుకు సంబంధించిన సహజ ప్రక్రియగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చాలా మందికి ప్రతి రాత్రి ఏదో ఒక రూపంలో కలలు రావడం సాధారణమే. అయితే, కొన్ని కలలు భయపెట్టేలా ఉంటే.. మరికొన్ని ఆనందాన్ని కలిగిస్తాయి. తెల్లవారు జామున వచ్చిన కలలు నిజమవుతాయనే భావన, భయంకరమైన కలలు మంచి శకునం కాదని అనుకోవడం వంటి అపోహలు ఇప్పటికీ చాలామందిలో ఉన్నాయి. అయితే నిపుణుల ప్రకారం.. ఇవన్నీ పూర్తిగా శాస్త్రీయ ఆధారాల్లేని నమ్మకాలేనని స్పష్టం చేశారు. కలలు నిజమవుతాయని నిరూపించే ఎలాంటి సైంటిఫిక్ డేటా ఇప్పటి వరకు లేనందున వాటిని శకున సూచనలుగా భావించడం పూర్తిగా తప్పని నిపుణులు చెబుతున్నారు.
మనిషి నిద్రలో ఉన్నప్పుడు, మెదడులోని పలు భాగాలు విశ్రాంతి తీసుకోవడంతో పాటు కొన్ని భాగాలు చురుకుగా పని చేస్తాయి. రైట్ ఫ్రంటల్ లోబ్‌లో జ్ఞాపకాలు, అనుభవాలు, భావోద్వేగాలకు సంబంధించిన న్యూరో ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. మనల్ని రోజు మొత్తం ఎక్కువగా ప్రభావితం చేసిన సంఘటనలు, ఆందోళన కలిగించిన భావాలు, దీర్ఘకాలంగా గుర్తుండే జ్ఞాపకాలు ఈ దశలో మళ్లీ రీ ప్రాసెస్ అవుతాయి. దీంతో మెదడు ఈ సమాచారాన్ని కలల రూపంలో బయటకు తెస్తుంది. పీడకలలు లేదా భయంకరమైన కలలు కూడా ఇదే ప్రాసెస్‌లో భాగమే. ఇవి శరీరానికి ఎలాంటి ప్రత్యక్ష హానీ కలిగించకపోయినా.. తీవ్రమైన మానసిక సమస్యలున్నప్పుడు మాత్రం ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కావున అలాంటి సందర్భాల్లో చికిత్స తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
భయం, ఆందోళన, డిప్రెషన్ లేదా స్కిజోఫ్రెనియా, బైపోలార్ డిజార్డర్ వంటి మానసిక రుగ్మతలున్నప్పుడు పీడకలలు తరచూ వస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. దెయ్యాలు వెంటాడుతున్నట్లు, ప్రమాదం జరుగుతున్నట్లు, మరణించిన ఆత్మీయులను కలలో చూసినట్లు అనుభవించడం వంటి అంశాలను చాలామంది పీడకలలుగా పిలుస్తారు. ఇవి సాధారణంగా రాపిడ్ ఐ మూవ్‌మెంట్ (REM) నిద్ర దశలోనే సంభవిస్తాయి. ఈ దశలో ఉన్నప్పటికీ మెదడు చాలా చురుకుగా పనిచేస్తూ భావోద్వేగాలు, అనుభవాలు, జ్ఞాపకాలను ప్రాసెస్ చేస్తుంది. అందువల్ల ఈ పరిస్థితిలో వచ్చే కలలు మరింత స్పష్టంగా, కొన్నిసార్లు భయంకరంగా అనిపిస్తాయి.
రాపిడ్ ఐ మూవ్‌మెంట్ దశలో, నిద్రలో ఉన్నప్పటికీ మెదడు మెలకువగా ఉన్నట్లు శక్తివంతంగా స్పందిస్తుంది. జ్ఞాపకాలు, భావోద్వేగాలు ఒకదానితో ఒకటి కలిసే ప్రాసెస్ జరుగుతుంది. మెదడు మనలోని గాఢమైన భావాలను బయటకు విడిచే ప్రయత్నంలో కొన్ని బాధాకరమైన అనుభవాలను కూడా కలల రూపంలో ప్రదర్శిస్తుంది. ముఖ్యంగా అధిక ఒత్తిడి, ఆందోళన, కోపం, జీవితంలోని చిన్న పెద్ద కష్టాలన్నీ కూడా కలల రూపంలో ప్రతిబింబించే అవకాశముంది. శరీరంలో సెరోటోనిన్, నోర్‌పైన్‌ఫ్రైన్, ఎసిటైల్కోలిన్ వంటి న్యూరో ట్రాన్స్‌మిటర్లలో మార్పులు వచ్చినా కలలు భయంకరంగా మారవచ్చు. ఈ కెమికల్స్ మన మానసిక స్థితి, భావోద్వేగాలు, నిద్ర నాణ్యతలన్నింటిని నియంత్రించే ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
స్లీప్ డిజార్డర్లు కూడా పీడకలలకు పెద్ద కారణం. స్లీప్ అప్నియా, ఇన్‌సోమ్నియా, రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్ వంటి సమస్యలున్నప్పుడు మెదడు విశ్రాంతి నిద్ర దశలకు వెళ్లలేకపోవడం వల్ల కలలు మరింతగా వస్తాయి. అత్యధికంగా మత్తు పదార్థాలు తీసుకోవడం, యాంటీ డిప్రెసెంట్స్ లేదా ఇతర మందులు వాడడం, నికోటిన్, కెఫిన్, టొబాకో, మద్యం వంటి పదార్థాలు అధికంగా తీసుకోవడం కూడా పీడకలల ఫ్రీక్వెన్సీ పెరగడానికి కారణమవుతాయి. మహిళల్లో గర్భధారణ సమయంలో, రుతుక్రమ మార్పుల సమయంలో లేదా రుతువిరతి దశల్లో హార్మోన్లలో వచ్చే అసమతుల్యత కూడా పీడకలలను పెంచుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
పీడకలలు తరచూ వస్తున్నాయని అనుకుని భయపడాల్సిన అవసరం లేదు. ముందుగా కలలను శకున సూచనలుగా భావించే తప్పుడు నమ్మకాలను విడిచిపెట్టడం చాలా ముఖ్యం. నిద్ర నాణ్యతను మెరుగుపరచుకోవడం, రోజువారీ ఒత్తిడిని తగ్గించుకోవడం, స్లీప్ షెడ్యూల్ పాటించడం, నిద్రకు ముందు మొబైల్ లేదా స్క్రీన్‌లకు దూరంగా ఉండడం, యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి సాధనలను చేయడం వలన మనసుకు ప్రశాంతత కలిగి పీడకలలను తగ్గించవచ్చు. అంతర్లీన మానసిక సమస్యలు ఉంటే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం అత్యంత అవసరం. నిద్రలో కలలు రావడం ఒక సహజ శరీర ప్రక్రియ మాత్రమేనని తెలుసుకుంటే పీడకలలను భయపడాల్సిన అవసరం ఉండదు.
ALSO READ: High Court: భార్య తరచూ ఆత్మహత్య బెదిరింపులు చేయడం కూడా క్రూరత్వమే





