
General Knowledge: ఒక దేశం భూభాగంలో శాశ్వత నదులు లేకపోవడం మనకు ఆశ్చర్యంగానే అనిపించవచ్చు. కానీ ప్రపంచంలో పలుచోట్ల ఇదే వాస్తవం. ఎడారి వాతావరణం, తగ్గిన వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు వంటి కారణాల వల్ల నీటి ప్రవాహాలు శాశ్వత నదులుగా మారం ముందే ఎండిపోతాయి. వర్షాలు లేకపోవడం లేదా మంచు కరగకపోవడం వల్ల ఈ ప్రాంతాల్లో నదుల ఏర్పాటుకు అవసరమైన సహజ పరిస్థితులు కలుగవు. ఇలాంటి ప్రాంతాల్లో ప్రజలు భూగర్భ జలాలు, వర్షపు నీటి నిల్వలు, అవసరమైతే దిగుమతి చేసుకున్న నీటిపైనే ఆధారపడుతున్నారు.

అరేబియా ద్వీపకల్పంలోని దేశాలు నదులు లేని ప్రాంతాలకు ప్రధాన ఉదాహరణ. సౌదీ అరేబియా వంటి దేశాల్లో సహజ నదులు ఏవీ లేవు. సముద్ర తీరాల్లో ఏర్పాటు చేసిన అధునాతన డీశాలినేషన్ ప్లాంట్ల ద్వారా సముద్రపు నీటిని శుద్ధి చేసి తాగునీటిగా మార్చుకుంటున్నారు. దేశానికి కావలసిన నీటి సగానికి పైగా ఈ టెక్నాలజీ ద్వారానే వస్తోంది. కువైట్, ఖతార్, యుఏఈ, ఒమన్, బహ్రెయిన్, యెమెన్ వంటి దేశాల పరిస్థితి కూడా పెద్దగా భిన్నంగా ఉండదు. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడినప్పుడు కొద్దిసేపు మాత్రమే ప్రవహించే తాత్కాలిక ప్రవాహాలను ‘వాడీలు’ అని పిలుస్తారు.

దీవుల దేశాల్లో నదుల లేమికి వేరే కారణాలు ఉంటాయి. మాల్దీవులు వంటి లోతట్టు దీవుల్లో భూభాగం పెద్దదిగా లేకపోవడం వల్ల నదులు ఏర్పడేందుకు కావాల్సిన పెద్ద పరీవాహక ప్రాంతాలు ఉండవు. పైగా సముద్రపు నీరు భూగర్భంలోకి చేరే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ప్రజలు పూర్తిగా వర్షపు నీటిని సేకరించడం, నిల్వ చేయడం, అవసరమైతే దిగుమతి చేసుకోవడం వంటి పద్ధతులపైనే ఆధారపడతారు. మాల్టా, బహామాస్, కిరిబాటి, తువాలు, నౌరు వంటి దీవుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

నదులు లేకపోయినా ఈ దేశాలు అభివృద్ధిలో వెనుకబడి పోలేదు. వీరి భౌగోళిక పరిస్థితులే వారిని ఆవిష్కరణల దిశగా నడిపించాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాలు డీశాలినేషన్ టెక్నాలజీలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. నీటిని సేకరించడం, శుద్ధి చేయడం, నిల్వ చేయడం, మళ్లీ ఉపయోగించేందుకు పునర్నిర్మాణం చేయడం వంటి పద్ధతుల్లో అవి విశేష పురోగతి సాధించాయి. ప్రజలకు అవసరమైన తాగునీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా సాంకేతికతను వినియోగిస్తున్నాయి.
ఈ దేశాల్లో నీటి సంరక్షణ అత్యంత కీలకంగా మారింది. వర్షం పడిన ప్రతిసారీ నీటిని నిల్వ చేసి, భూగర్భ జలాలు పాడైపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గృహాలలో, వ్యవసాయంలో నీటి వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. మురుగునీటిని శుద్ధి చేసి మళ్లీ ఉపయోగించడం, ఆహారం మరియు నీటిని ఇతర దేశాలనుంచి దిగుమతి చేసుకోవడం వంటి పద్ధతులు కూడా ఈ దేశాల జీవన విధానంలో భాగం అయ్యాయి.
ప్రస్తుతం ప్రపంచంలో శాశ్వత నదులు లేని దేశాల జాబితాలో సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ, ఖతార్, ఒమన్, బహ్రెయిన్, యెమెన్, లిబియా, జిబౌటి, మాల్దీవులు, మాల్టా, మొనాకో, వాటికన్ సిటీ, నౌరు, కిరిబాటి, తువాలు, మార్షల్ దీవులు, టోంగా వంటి దేశాలు ఉన్నాయి. నదులు లేకున్నా తమకు అవసరమైన నీటిని సాంకేతికత, నీటి సంరక్షణ పద్ధతుల ద్వారా సమర్థవంతంగా నిర్వహించుకుంటూ ఈ దేశాలు ముందుకు సాగుతున్నాయి.
ALSO READ: Divorce Trends: బలహీనమవుతున్న బంధాలు.. పెరిగిపోతున్న విడాకులు





