భారతదేశంలోనూ చైనా వైరస్ పంజా విసురుతోంది. సోమవారం ఒక్కరోజే ఏడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో రెండు, చెన్నైలో రెండు కేసులు నమోదయ్యాయి. పక్క రాష్ట్రాల్లో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.రాష్ట్రంలో కొత్త కేసులు నమోదైతే.. తీసుకోవాల్సిన చర్యలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు.
గాంధీ ఆస్పత్రిలో బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 600 ఆక్సిజన్ బెడ్స్, 450కి పైగా వెంటిలేటర్లు, 400 మానిటర్లు, 40 వేల కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు, వందలాది ఆక్సిజన్ సిలిండర్లు, పీడియాట్రిక్ వెంటిలేటర్లు అందుబాటులోకి తెచ్చారు. హెచ్‌ఎంపీవీ అంత ప్రమాదకరం కాదనీ గాంధీ వైద్యులు తెలిపారు. ఇది సాధారణ ఇన్‌ఫ్లూయెంజా మాత్రమేననీ.. 4 నుంచి 7 రోజుల్లో తగ్గిపోతుందన్నారు.
హెచ్‌ఎంపీవీపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ. ఈ వైరస్ కొత్తదేమీ కాదన్నారు. 2001 నుంచి వ్యాప్తిలో ఉందని తెలిపారు. ఈ వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయనీ, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సోషల్ మీడియాలో ప్రజలను భయ భ్రాంతులకు గురి చేసే .. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ప్రభుత్వం సీరియస్‌గా పరిగణిస్తుందని హెచ్చరించారు.