జాతీయం

ఉప్పు నుంచి ఉక్కు వరకు.. రతన్ టాటా 10 గొప్ప అంశాలు ఇవే..

బిజినెస్ చేయటమే కాదు మానవత్వంలోనూ రతన్‌ టాటా టాప్.ఉప్పు నుంచి ఉక్కు వరకు టాటాలు ప్రవేశించని రంగమే లేదు. ఏ వ్యాపారమైనా నాణ్యతే, నమ్మకమే లక్ష్యంగా అంచెలంచెలుగా ఎదిగిన టాటా గ్రూప్‌ ప్రస్థానంలో రతన్‌ టాటా కృషి అసామన్యమైనది. నిత్య మార్గదర్శకుడిగా, దాతృత్వశీలిగా, మానవతావాదిగా పేరు గడించిన రతన్‌ టాటా.. ప్రపంచంలోనే దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్‌.. తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. రతన్‌ టాటా ఎప్పుడూ లాభాల కంటే చిత్తశుద్ధికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అదే ఆయనకు అపారమైన గౌరవాన్ని సంపాదించిపెట్టింది. తీసుకొనే నిర్ణయాలు స్వల్పకాలిక లాభాల కంటే సంస్థకు, సమాజానికి దీర్ఘకాలిక శ్రేయస్సుకు ఉపయోగపడేలా ఉండాలని భావిస్తారు. అందుకే వ్యాపారవేత్తల్లో ఆయన ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు.

రతల్ టాటా అనగానే ప్రత్యేకంగా కొన్ని అంశాలు గుర్తుకు వస్తాయి. దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత రతన్‌టాటా. కానీ, ఆయన ఎంతో వినయంగా ఉంటారు. ప్రచారాలకు, ఆర్భాటాలకు దూరంగా.. సాధారణ జీవనశైలితో ఉండటానికి ఇష్టపడతారు. రతన్‌ టాటా నాయకత్వంలో.. టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది, జాగ్వార్, ల్యాండ్ రోవర్, కోరస్ స్టీల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలను కొనుగోలు చేసింది. ఆయన టాటా కంపెనీని బహుళజాతి కంపెనీగా మార్చారు. సంస్థ విలువను నిలుపుకుంటూనే టాటా గ్రూప్‌ను ప్రపంచ బ్రాండ్‌గా మార్చారు.

రతన్‌ టాటా దాతృత్వానికి పెట్టింది పేరు. టాటా గ్రూప్ సంపదలో అధిక భాగం టాటా ట్రస్ట్‌ల ద్వారా ధార్మిక కార్యక్రమాలకు కేటాయించేవారు. ఆయన ఎల్లప్పుడూ నైతిక వ్యాపార పద్ధతులను పాటిస్తూ.. సామాజిక బాధ్యత తీసుకోవాలని చెబుతుంటారు. రతన్‌ టాటా ఎప్పుడూ వినూత్నంగా ఆలోచించేవారు. సామాన్యప్రజలకు కారు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకు నానో కారును ఆవిష్కరించారు. ఆయన తీసుకున్న ఎన్నో సాహసోపేత నిర్ణయాలు సంస్థను ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడ్డాయి.

ముంబయిలోని తాజ్‌ హోటల్‌లో 2008లో ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో రతన్‌ టాటా చూపించిన ఉదారత ఎంతో గొప్పది. హోటల్‌ సిబ్బందితోపాటు బాధితులుగా మారిన వారందరికీ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి ఉన్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఆయన ఎప్పుడూ భారతీయ విలువలు, సంస్కృతిని విస్మరించలేదు. భారతీయుడిగా గర్వపడుతూ.. ఆధునిక వ్యాపారంలోనూ ప్రపంచంతో పోటీ పడ్డారు. ఉద్యోగుల పట్ల ఆయన ఎంతో శ్రద్ధ చూపేవారు. సంక్షోభ సమయాల్లో ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడేవారు. టాటా స్టీల్‌లో కంపెనీలో పనిచేసే ఉద్యోగులు మరణించినప్పుడు వారి కుటుంబ బాధ్యత తీసుకున్నారు. కార్పొరేట్‌ ప్రపంచంలో ఇదో అరుదైన విధానంగా చెబుతుంటారు.

భారత ప్రభుత్వం ఆయనను పద్మ భూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలతో సన్మానించింది. ఆయన తన దానధర్మాలకు కూడా ప్రసిద్ధి చెందారు తన ఆస్తిలో సుమారు 60 శాతం దానధర్మాలకే కేటాయించేవారు. రతన్ టాటా చరిత్ర గురించి చెప్పాలంటే ఒక వ్యాసం సరిపోదు ఒక మహా గ్రంథం అయినా సరిపోదు. ఈ దేశంలో జరిగిన ప్రతి అభివృద్ధి వెనుక రతన్ టాటా నీడలా నిలబడ్డారు. దేశ సరిహద్దుల్లో జవాన్ నుంచి పొలాల్లో రైతుల వరకు టాటా తన వ్యాపారం ద్వారా సేవలను అందించింది.

Also Read : దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత

ఒక సాధారణ మధ్యతరగతి వ్యక్తి సొంత కారులో కుటుంబంతో సహా వెళ్లాలని కలలుకని ఎంతో ఇష్టంగా డిజైన్ చేసి విడుదల చేసిన టాటా నానో కారు. రతన్ టాటా అభిరుచికి నిదర్శనం. దేశంలోని సామాన్యులకు సైతం టాటా తన ఉత్పత్తుల ద్వారా సేవా కార్యక్రమాల ద్వారా చేరువైంది. నేడు భారతదేశంలో ఐటీ రంగ విప్లవం వెనుక రతన్ టాటా కృషి అనితర సాధ్యమైనదని చెప్పవచ్చు.

ప్రపంచంలోనే నెంబర్ వన్ ఐటీ సర్వీసుల సంస్థగా టిసిఎస్ ఎదిగింది. సుమారు పది లక్షల మంది ఉద్యోగులు టాటా గ్రూపు సంస్థల ద్వారా నేడు ఉపాధిని పొందుతున్నారు. అంతకు పదిరెట్లు మంది పరోక్షంగా టాటా సంస్థల నుంచి ఉపాధిని పొందుతున్నారు…రతన్ టాటాను ఆధునిక భారత జాతి నిర్మాతగా కీర్తించినా తక్కువే.అల్విదా రతన్ టాటా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button