రాజస్థాన్ జైల్లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ఖైదీలు ప్రేమించుకున్నారు. పెరోల్ మీద బయటకు వచ్చిన ఆ ఇద్దరూ ఇప్పుడు పెళ్లి పీటలెక్కబోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
2017లో అల్వార్‌కు చెందిన హనుమాన్ ప్రసాద్ అనే వ్యక్తి ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలి భర్తను, పిల్లలను అతి దారుణంగా హత్య చేశాడు. మొత్తం ఐదుగురిని అతి కిరాతకంగా మటన్ కొట్టే కత్తితో నరికి ప్రాణాలు తీశాడు. తర్వాత పోలీసులకు దొరికిపోయాడు. దీంతో హనుమాన్ ప్రసాద్‌కు జీవిత ఖైదు విధించింది న్యాయస్థానం.
అప్పులు తీర్చేందుకు కన్నింగ్ ఫ్లాన్!
2018లో ప్రియా సేథ్ అనే యువతి తన ప్రియుడు దీక్షిత్ కమ్రా అప్పులు తీర్చేందుకు ఓ కన్నింగ్ ప్లాన్ వేసింది. డేటింగ్ యాప్ ద్వారా దుష్యంత్ శర్మ అనే యువకుడిని పరిచయం చేసుకుంది. తర్వాత అతడిని రూముకు పిలిచి కిడ్నాప్ చేసింది. ప్రియకు ఆమె ప్రియుడు దీక్షిత్, మరో యువకుడు లక్ష్య వాలియా కూడా సహకారం అందించారు. ముగ్గురూ కలిసి అతడ్ని రూ.10 లక్షలు అడిగారు. అయితే దుష్యంత్ కేవలం రూ.3 లక్షలు మాత్రమే ఇవ్వగలిగాడు. అతడ్ని బయటకు పంపిస్తే.. కిడ్నాప్ విషయం బయటపడుతుందన్న భయంతో ముగ్గురూ కలిసి అతణ్ని హతమార్చారు. ఈ కేసులో సూత్రధారి అయిన ప్రియకు కోర్టు జీవిత ఖైదు విధించింది.
ఇద్దరు హంతకుల ప్రేమాయణం
ఈ ఇద్దరూ ప్రస్తుతం రాజస్థాన్‌లోని అల్వార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆరు నెలల క్రితం జైలులో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి చేసుకోవడానికి పెరోల్ కావాలని హైకోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. వీరి పెళ్లి కోసం 15 రోజుల పెరోల్ ఇచ్చింది. ప్రియ, హనుమాన్ ప్రసాద్‌లు పెరోల్ మీద బయటకు వచ్చి పెళ్లి చేసుకోనున్నారు. 15 రోజుల తర్వాత మళ్లీ జైలుకు వెళ్లనున్నారు.





