
Roman Babushkin: రష్యాపై వత్తిడి తెచ్చేందుకే ఇండియాపై టారిఫ్ లు విధించినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. భారతీయ ఉత్పత్తులపై ట్రంప్ సర్కార్ 50 శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తున్న నేపథ్యంలో.. ఈ విషయంపై కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనూ రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ఇతర దేశాలపై అదనపు టారిఫ్ లు విధించినట్లు వైట్ హౌజ్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ వెల్లడించారు. అందులో భాగంగానే భారత్ పైనా టారిఫ్ లు విధించినట్లు తెలిపారు.
యుద్ధం అపేందుకు ట్రంప్ ప్రయత్నాలు
ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపేందుకు అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేశారని కరోలినా వెల్లడించారు. ఆయన ఎన్నో చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఇండియాపై టారిఫ్ విధించారని చెప్పారు. ఇతర దేశాలపై కూడా చర్యలు తీసుకున్నారన్నారు. ఈ యుద్ధం ఆగిపోవాలని ఆయన క్లియర్‌గా ఉన్నారని చెప్పుకొచ్చారు. వీలైనంత త్వరగా శాంతి స్థాపన చేయాలని ట్రంప్ ఆశిస్తున్నారని కరోలినా వివరించారు. యురోపియన్ దేశాలు, నాటో జనరల్ సెక్రటరీ కూడా యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచిస్తున్నట్లు ఆమె చెప్పారు. రష్యా, ఉక్రెయిన్ దేశాధినేతలు చర్చల ద్వారా ఆ సమస్యకు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పుతిన్, జెలెన్‌స్కీ మధ్య వీలైనంత త్వరలో చర్చలు ఉంటాయన్నారు.
అమెరికా వ్యాఖ్యలను తప్పుబట్టిన రష్యా!
తమ దేశం నుంచి ఆయిల్ కొనుగోళ్లు చేస్తున్న భారత్ పై అమెరికా వైఖరి దారుణంగా ఉందని రష్యా వ్యాఖ్యానించింది. ఇరు దేశాల మధ్య ఇంధన సహకారం భవిష్యత్తులోనే కొనసాగుతుందని రష్యా దౌత్యవేత్త రోమన్ బబుష్కిన్ వెల్లడించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థలను ఆయుధంలా వాడుతోందని విమర్శించారు. వాస్తవానికి మిత్రులు ఎప్పుడూ ఆంక్షలు విధించరని వెల్లడించారు. రష్యా భవిష్యత్తులోనూ భారత్ పై అలాంటి చర్యలు తీసుకోదన్నారు. భారత్‌కు ఎలాంటి ఇబ్బందిలేకుండా చమురు సరఫరా చేసేందుకు మాస్కో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని బబుష్కిన్ చెప్పారు. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి తమ దేశం కట్టుబడి ఉందని బబుష్కిన్ అన్నారు. భారత్ తమకు చాలా ముఖ్యమైన దేశమని, అందుకే అధ్యక్షుడు పుతిన్ స్వల్ప వ్యవధిలోనే రెండుసార్లు ప్రధాని మోదీతో మాట్లాడారని బబుష్కిన్ అన్నారు.