- విద్యార్థి దశలోనే పార్టీ విధానాలకు ఆకర్షితుడినయ్యా…!
- అజ్ఞాతం నుంచి జన జీవన స్రవంతిలోకి వచ్చా
- ప్రజా ప్రభుత్వం చేయూత నివ్వాలి
- తెలంగాణ మావోయిస్టు పార్టీ బండి ప్రకాశ్ దంపతులు
మంచిర్యాల , క్రైమ్ మిర్రర్: విద్యార్థి దశ నుంచి విప్లవ భావాలతో పీపుల్స్ వారి అనుబంధ విద్యార్థి సంఘం ఉద్యమాలకు ఆకర్షితుడైన మందమర్రికి చెందిన బండి ప్రకాశ్ అడవి బాట పట్టారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి దండకారణ్యంలో పని చేశారు.
దోపిడి, అణచివేతపై ప్రజా ఉద్యమాలే లక్ష్యంగా పని చేశారు. అనేక సార్లు ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకున్నారు. ఒక సారి అరెస్టయి ఆదిలాబాద్ జైలు నుంచి తప్పించుకున్నారు.తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడితో పాటు సింగరేణి కార్మికుల కోసం ఏర్పడినటువంటి సింగరేణి కార్మిక సమాఖ్య(సీకాసా) కోల్ బెల్ట్ కార్యదర్శి ఏలియాస్ ప్రభాత్ పేరిట కూడ పని చేశారు.
సింగరేణిలో జరిగినటువంటి అనేక సమ్మెలకు సికాసా మద్దతుతో విజయవంతమైన సందర్బాలు కూడా ఉన్నాయి. ప్రభాత్ పేరిట పోస్టర్లు వేసిన లేఖలు, విడుదల చేసినా కోల్ బెల్ట్‌లో సంచలనాలతో పాటు అనేక చర్చలు జరిగిన సందర్భాలు కూడ ఉన్నాయి.
కాగా ఇటీవల పోలీసు కూంబింగ్‌లు, కేంద్రం స్పెషల్‌గా తెచ్చిన ఆపరేషన్ కగార్‌తో పార్టీ తీవ్రంగా నష్టపోయింది. దీంతో వయస్సు పైబడి ఆరోగ్యం క్షీణించడంతో పాటు పార్టీకి భారం కాకూడదనే ఉద్దేశంతో అజ్ఞాతంలో ఉండలేక ఇటీవలనే జనజీవన స్రవంతిలో కలిశారు.
ప్రస్తుతం ఆయన మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని 2వ జోన్‌లోని ఒక ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన క్రైమ్ మిర్రర్ తో మాట్లాడారు.
విద్యార్థి దశ నుంచే ఉద్యమాల వైపు…
విద్యర్థి దశ నుంచే ఉద్యమాల వైపు ఆకర్షితుడైనట్లు తెలిపారు. దీంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిపారు. కుటుంబం కూడ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపారు. పార్టీకి బారం కాలేక తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన అవకాశంతో ప్రజా జీవితంలోకి వచ్చానని తెలిపారు.
తనపై ఉన్నటువంటి రివార్డు 20లక్షలు వచ్చిందని తెలిపారు. తాను అనారోగ్యంతో ఉండడంతో రాష్ట్ర డీజీపీ యశోద ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు తెలిపారు. ప్రస్తుతం రెండు కిడ్నీలు కూడ పాడైనట్లు తెలిపారు. ఐదెకరాల భూమితో పాటు ఉండడానికి ఒక డబుల్‌బెడ్ రూం ఇల్లు కావాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
రామగుండం సీపీ అంబర్ కిషోర్‌ఝాను కలిశానని ఆయన బాగానే స్పందించారని తెలపారు. తనకు ఉండేందుకు ఇల్లు, వైద్యం అందించాలని కోరారు. ప్రజా ప్రభుత్వం తనకు తప్పకుండా చేయూతనిస్తుందని ఆశాబావం వ్యక్తం చేశారు. కగార్ గురించి అడుగగా సమాజాన్ని మార్చే శక్తి ప్రజలకు ఉంటుందని తెలిపారు. ఇతర అంశాలపై మాట్లాడడం నిరాకరించారు.

