
జోగులాంబ గద్వాల జిల్లాలో కలుషిత ఆహారం కలకలం రేపింది. ఇటిక్యాల మండలం ధర్మవరం బీసీ వసతి గృహంలో రాత్రి భోజనం చేసిన సుమారు 86 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
వసతిగృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా… శుక్రవారం 110 మంది హాజరయ్యారు. రాత్రి భోజనాలయ్యాక 9 గంటల తర్వాత 86 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వసతిగృహం సిబ్బంది, పోలీసులు వారిని అంబులెన్స్‌లో గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భోజనంలో కల్తీ కారణమా లేక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. రాత్రి అదనపు కలెక్టర్ నర్సింగ్ రావు, ఆర్డీఓ అలివేలు జిల్లా ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.





