తెలంగాణ

కృష్ణమ్మ పరవళ్లు, శాంతిస్తున్న గోదావరి!

కృష్ణా నదికి భారీగా వరద

భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి శాంతిస్తోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వర్షాలకు కురవడంతో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా, భీమా, తుంగభద్ర నదులకు వరద పెరుగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 5.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. అధికారులు పది గేట్లు ఎత్తి 4.20 లక్షల క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుకు 4.32 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 26 క్రస్ట్‌ గేట్ల నుంచి 3.81 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుత్‌ కేంద్రాల్లో జోరుగా ఉత్పత్తి జరుగుతోంది.

గోదావరి వరద తగ్గుముఖం

భారీ వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన గోదావరి నెమ్మదిగా శాంతిస్తోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 51.9 అడుగులు ఉండగా వరద ప్రవాహం 13.66 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ఇవాళ  తెల్లవారుజాముకల్లా ఈ ప్రవాహం మరింతగా తగ్గింది. పలు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం దుమ్ముగూడెం కు 13.23 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. తుపాకులగూడెం బ్యారేజీకి 8.26 లక్షలు, మేడిగడ్డకు 7.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. వచ్చింది వచ్చినట్లే దిగువకు వదిలిపెట్టారు. గోదావరి ఉధృతితో తెలంగాణ-ఏపీ సరిహద్దులోని అల్లూరి జిల్లా యటపాక మండలం రాయనిపేట వద్ద జాతీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరింది.  భద్రాచలం-చర్ల మార్గంలో కూడా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి ఉగ్రరూపంతో ఏపీలోని ఏలూరు జిల్లా వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.   భద్రాచలం నుంచి దిగువకు 13.60 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుండటంతో వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గ్రామాలను వరద చుట్టుముట్టింది. కుక్కునూరు మండలంలో 1,222 కుటుంబాలు, వేలేరుపాడు మండలంలో 2,468 కుటుంబాలు ముంపునకు గురయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button