రాధాకృష్ణకు కీలక పదవి
ముందుగా ఎమ్మెల్సీ, ఆపై క్యాబినెట్లోకి
చంద్రబాబుతో పాటు పవన్ సానుకూలత
నారా లోకేష్ సైతం ప్రత్యేక చొరవ.!
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వంగవీటి రాధాకృష్ణకు మంచి రోజులు వస్తున్నాయా? త్వరలో ఆయనకు కీలక పదవి వరించనుందా? ఈ మేరకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సానుకూలంగా ఉన్నారా? మంత్రి నారా లోకేష్ సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ప్రస్తుతం కాపుల అంశం చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతుండడంతో ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ సేవలను కూటమి వినియోగించుకోవాలని చూస్తోంది. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది.
వంగవీటి మోహన్ రంగ వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రాధాకృష్ణ. మోహన్ రంగా కాపుల్లో ఒక ఐకానిక్ లీడర్ గా నిలిచారు. కేవలం ఒక సామాజిక వర్గం మాత్రమే కాదు.. బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచారు. ఈ క్రమంలోనే పేదల ఇళ్ల కోసం నిరసన శిబిరంలో ఉన్న వంగవీటి మోహన్ రంగ దారుణ హత్యకు గురయ్యారు. ఆ సమయంలో రాధాకృష్ణ చాలా చిన్నవాడు. అటు తరువాత రంగా హత్య కేసు విచారణ కొలిక్కి రాలేదు. దీనిపై రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ వచ్చాయి. అయితే రాధాకృష్ణ అందుబాటులోకి వచ్చి రాజకీయం చేయడం ప్రారంభించారు. కానీ ఏపీ రాజకీయాల్లో అనుకున్న స్థాయిలో ఆయన రాణించలేకపోయారు. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం అందుకు కారణం.
కాంగ్రెస్ లో అరుదైన చాన్స్
2003లో వైయస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అందులో భాగంగానే మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. 2004 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన రాధాకృష్ణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అత్యంత చిన్న వయస్సు నేతగా గుర్తింపు పొందారు. కానీ 2009 ఎన్నికల్లో ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి వద్దని వారించినా వినకుండా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు 2014 ఎన్నికల్లో. కానీ ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టికెట్ ఆశించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ జగన్ మోహన్ రెడ్డి మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని సూచించారు. అందుకు అంగీకరించని రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డితో విభేదించి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో టిడిపిలో చేరి స్టార్ క్యాంపెయినర్గా పనిచేశారు. కానీ ఆ ఎన్నికల్లో టిడిపి ఓడిపోయింది. అయినా సరే అదే పార్టీలో కొనసాగారు. 2024 ఎన్నికల్లో కూటమి తరుపున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.
వైసీపీకి చెక్..
కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు సమీపిస్తోంది. కానీ వంగవీటి రాధాకృష్ణకు ఇంతవరకు నామినేటెడ్ పదవి దక్కలేదు. ఎమ్మెల్సీ తో పాటు రాజ్యసభ పదవుల ఎంపిక సమయంలో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తూ వస్తోంది. కానీ తరువాత సమీకరణలో భాగంగా ఆయనకు చాన్స్ లేకుండా పోతోంది. అయితే ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కాపు రాజకీయాన్ని తెరపైకి తెస్తోంది. కూటమి ప్రభుత్వంలో కాపులకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల్లో కూటమి పెద్దలు డిఫెన్స్ లో పడ్డారు. ఆ విమర్శలను వంగవీటి రాధాకృష్ణ ద్వారా తిప్పి కొట్టాలని భావిస్తున్నారు. త్వరలో ఖాళీ కాబోయే ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి వంగవీటి రాధాకృష్ణకు కేటాయిస్తారని తెలుస్తోంది. అంతటితో ఆగకుండా ఆయనను క్యాబినెట్ లోకి తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. మొత్తానికైతే వంగవీటి వారసుడికి ఎట్టకేలకు పవర్ పాలిటిక్స్ చిక్కుతాయన్నమాట.

