
బీరూరు ఠాణా పరిధిలో చోటుచేసుకున్న ఓ దారుణ ఘటన సమాజాన్ని కలచివేసింది. రోజుకు రూ.5 వేలు వస్తాయనే ఆశతో కన్న తండ్రే తన 17 ఏళ్ల మైనర్ కుమార్తెను పడుపు వృత్తిలోకి నెట్టిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో బాధిత బాలిక తండ్రి, నాయనమ్మతో పాటు ఆమెను వృత్తిలోకి దించి లైంగికంగా హింసించిన 10 మందిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బాధితురాలి వాంగ్మూలం ప్రకారం.. పడుపు వృత్తిలోకి దించే ముందు మంగళూరుకు చెందిన భరత్ శెట్టి అనే వ్యక్తి మరో నలుగురితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ నిందితుల వయస్సు 20 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
బాలికకు శారీరక అస్వస్థతలు ఉన్నా, రుతుస్రావం జరుగుతుందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని, బలవంతంగా లైంగిక దౌర్జన్యానికి పాల్పడుతూ తీవ్రంగా వేధించారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తనను రక్షించాల్సిన తండ్రి, నాయనమ్మే డబ్బుల కోసం ఈ నరకాన్ని మోపడంతో మానసికంగా పూర్తిగా కుంగిపోయినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. రోజువారీ వేధింపులు, భయాందోళనలు తట్టుకోలేక చివరకు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఈ భయంకర వ్యవహారం బయటపడింది.
ఫిర్యాదు అందుకున్న వెంటనే బీరూరు పోలీసులు వేగంగా స్పందించి నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నారు. మైనర్ బాలికపై లైంగిక దౌర్జన్యం, మానవ అక్రమ రవాణా, బలవంతపు పడుపు వృత్తి వంటి తీవ్రమైన అభియోగాలతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాధితురాలిని రక్షణ గృహానికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహిస్తూ కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరెవరి పాత్ర ఉందా అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
ALSO READ: మరీ ఇంత దారుణమా!.. రూ.3 లక్షలకు గిరిజన యువతి అమ్మకం





