
క్రైమ్ మిర్రర్, మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండాకు చెందిన నునావత్ సైదా (వ్యవసాయ కూలీ, ట్రాక్టర్ డ్రైవర్) తన భార్య నునావత్ సునీతను (మృతురాలు) ట్రాక్టర్ ట్రాలీలో ఎక్కించుకొని సూర్యాపేట జిల్లా జటావత్ తండాకు బంధువుల ఇంటికి బొడ్రాయి పండుగ కోసం వెళ్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3.40 గంటలకు మిర్యాలగూడ పట్టణంలోని నార్కట్ పల్లి-అద్దంకి స్టేట్ హైవే-2 బైపాస్ లోని మద్రాస్ ఫిల్టర్ కాపీ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
అదే దిశగా వెనుక నుంచి వేగంగా వస్తున్న ట్రావెల్ బస్సు (డ్రైవర్ కూరకుల రెడ్డి శేఖర్, బుచ్చిరెడ్డిపాలెం గ్రామం) నిర్లక్ష్యంగా, అతివేగంగా డ్రైవ్ చేస్తూ ట్రాక్టర్‌ను ఢీకొట్టాడు. దాంతో ట్రాక్టర్ ట్రాలీ పల్టీ కొట్టి, అందులో కూర్చున్న నునావత్ సునీత తలకు తీవ్రమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఆమె చాతి, కాళ్ల ఎముకలు విరిగిపోయాయి. ట్రాక్టర్ నడుపుతున్న నునావత్ సైదా తలకు బలమైన దెబ్బ తగలడంతో ఆయన కోమాలోకి వెళ్లాడు. ప్రమాదంలో బస్సు ప్రయాణికులు గ్రిద్దలూరు శివరామకృష్ణ రెండు కాళ్లకు తీవ్ర గాయాలు, తోటపల్లి నాగచరిత్ ముక్కు, కుడి మోకాలుపై గాయాలపాలయ్యాడు. ఇంకా మరికొందరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.ఈ ఘటనపై మృతురాలి కూతురు నునావత్ నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 106(1), 125(ఎ) బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.