
FASTag: హైవేలపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం నిజంగానే భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్‌ట్యాగ్‌కు సంబంధించిన సమస్యలతో ఇప్పటివరకు పడిన ఇబ్బందులు ఇక చరిత్రకే పరిమితం కానున్నాయి. ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేసిన తర్వాత యాక్టివేషన్ కోసం రోజుల తరబడి ఎదురుచూడటం, పత్రాలు పదే పదే అప్‌లోడ్ చేయడం, వెరిఫికేషన్ కాలేదంటూ టోల్ గేట్ల వద్ద జరిమానాలు చెల్లించాల్సిన పరిస్థితులకు త్వరలోనే ముగింపు పలకనుంది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఫిబ్రవరి 1, 2026 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనల ప్రకారం, ఫాస్ట్‌ట్యాగ్ యాక్టివేషన్‌కు తప్పనిసరిగా ఉండే నో యువర్ వెహికల్ ప్రక్రియను పూర్తిగా రద్దు చేశారు. ఇప్పటివరకు వాహనదారులు తమ వాహన ఫోటోలు, ఆర్‌సీ కాపీలు, ఇతర వివరాలను పలు మార్లు అప్‌లోడ్ చేయాల్సి వచ్చేది. ఈ ప్రక్రియలో చిన్న లోపం జరిగినా ట్యాగ్ యాక్టివేషన్ ఆలస్యం కావడం, టోల్ ప్లాజాల వద్ద డబుల్ చార్జ్ వసూలు చేయడం వంటి సమస్యలు ఎదురయ్యేవి.
సాంకేతిక లోపాలు, ధృవీకరణలో జాప్యం కారణంగా లక్షలాది మంది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారన్న ఫిర్యాదులు NHAI దృష్టికి వెళ్లాయి. సరైన పత్రాలు ఉన్నప్పటికీ ఫాస్ట్‌ట్యాగ్ పనిచేయకపోవడం వల్ల డ్రైవర్లు అనవసరంగా జరిమానాలు చెల్లించాల్సి వచ్చేది. ఈ సమస్యలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం, మొత్తం బాధ్యతను బ్యాంకులపైకి మళ్లిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
కొత్త విధానం ప్రకారం.. వాహనదారు ఫాస్ట్‌ట్యాగ్ కోసం దరఖాస్తు చేసిన వెంటనే సంబంధిత బ్యాంకు ప్రభుత్వ వాహన్ డేటాబేస్ ద్వారా వాహన వివరాలను నేరుగా ధృవీకరిస్తుంది. డేటాబేస్‌లో సమాచారం అందుబాటులో ఉంటే, ఎలాంటి అదనపు పత్రాలు అవసరం ఉండవు. ఒకవేళ వివరాలు అందుబాటులో లేకపోతే మాత్రమే ఆర్‌సీ ఆధారంగా తనిఖీ చేపడతారు. ఈ మొత్తం ప్రక్రియ ట్యాగ్ జారీకి ముందే పూర్తవుతుండటంతో, ఫాస్ట్‌ట్యాగ్ చేతికి రాగానే వాడుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే ఫాస్ట్‌ట్యాగ్ ఉపయోగిస్తున్న వాహనదారులకు కూడా ఈ మార్పులు పెద్ద ఊరటనిస్తాయి. ఇకపై సాధారణంగా ఎలాంటి KYV రీ వెరిఫికేషన్ అవసరం ఉండదు. కేవలం ఫిర్యాదులు వచ్చినప్పుడు లేదా దుర్వినియోగం జరిగినట్లు అనుమానం ఉన్న సందర్భాల్లో మాత్రమే అధికారులు తిరిగి తనిఖీలు చేపడతారు. దీని వల్ల వినియోగదారులపై అనవసరమైన ఒత్తిడి తగ్గనుంది.
ఈ కొత్త విధానంతో వాహనదారులకు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేసిన వెంటనే ఉపయోగించుకోవచ్చు. పత్రాలను పదే పదే స్కాన్ చేసి అప్‌లోడ్ చేసే తలనొప్పి ఉండదు. వెరిఫికేషన్ కాలేదని బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం, కస్టమర్ కేర్‌కు ఫోన్లు చేసే పరిస్థితి తగ్గుతుంది. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద అనవసర జాప్యాలు లేకుండా ప్రయాణం మరింత సులభమవుతుంది.
ALSO READ: రాజకీయాలను కుదిపేసిన విమాన ప్రమాదాలు.. బలైన నేతలు వీరే..!





