
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డేస్క్ : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రవేశపెట్టిన రూ. 3000 వార్షిక ఫాస్ట్ ట్రాక్ పాస్ నేడు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ పాస్ కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర వాహనాల కోసం మాత్రమే అందుబాటులో ఉంది. ఈ పాస్‌ను తీసుకున్నవారికి ఏడాది పొడవునా 200 ట్రిప్పుల వరకూ ఎటువంటి అదనపు టోల్ చార్జీలు లేకుండా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. టోల్ చెల్లింపులు పదేపదే రీచార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా సౌకర్యాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈ పథకం రూపొందించారు. వాహనదారులు రాజ్‌మార్గ్ యాత్ర మొబైల్ యాప్ లేదా NHAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ వాహనం నంబర్ లేదా రిజిస్టర్ మొబైల్ నెంబర్‌తో లాగిన్ అయి దరఖాస్తు చేసుకోవచ్చు. వాహనంపై ఫాస్ట్ ట్యాగ్ యాక్టివ్‌గా ఉండి విండ్షీల్డ్‌పై సరిగ్గా అతికించి ఉండాలి. ఆపై రూ. 3000 ఆన్‌లైన్ ద్వారా చెల్లించి, పాస్‌ను ఫాస్ట్ ట్యాగ్‌కు లింక్ చేయాల్సి ఉంటుంది. చెల్లించిన తేదీ నుంచి ఇది ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది.
ఈ పాస్ ఎక్కువగా రోజువారీ లేదా వారానికొన్ని సార్లు ప్రయాణించే వాహనదారులకు ప్రయోజనం కలిగించనుంది. మెట్రో నగరాల చుట్టుపక్కల నివసించి నగరాల్లో పని చేసే ఉద్యోగులు, తరచూ కుటుంబ ప్రయాణాలు చేసే వర్గాలు దీని లబ్ధిదారులవుతారు. టోల్ గేట్ల వద్ద క్యూ నుంచి విముక్తి, టోల్ చార్జీలపై నియంత్రణ, నిరంతర ప్రయాణానికి విశ్వాసంతో ముందుకు సాగేందుకు ఇది ఉపశమనంగా మారుతుంది. అయితే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయని వాహనదారులు గుర్తుంచుకోవాలి. ఇది కేవలం 200 ట్రిప్పులకే పరిమితం. అంటే మాసానికి సగటున 16–17 ట్రిప్పులు మాత్రమే ప్రయోజనకరంగా ఉండే విధంగా రూపొందించబడింది. ఈ లిమిట్ దాటి ప్రయాణిస్తే మళ్లీ టోల్ చెల్లింపులు మొదలవుతాయి. అంతేకాదు వాణిజ్య వాహనాలకు ఇది వర్తించదు. ఇకపోతే, ఒక్కో పాస్ ఒక్క వాహనానికి మాత్రమే లింక్ అవుతుంది. షేరింగ్, మల్టీ వాహికల ప్రయోజనం ఈ పథకంలో లేదు. టెక్నికల్ లోపాలు, లింకింగ్ సమస్యలు వచ్చే అవకాశమూ పాస్ వినియోగదారుల నుంచి వస్తున్న సూచనలలో భాగం. ప్రభుత్వ ఉద్దేశం ప్రకారం ఈ పాస్ ద్వారా ఫాస్ట్ ట్రాక్ వినియోగం మరింత విస్తరించనుంది. టోల్ చెల్లింపుల పారదర్శకత, వేగవంతమైన ప్రయాణం, ఆర్థిక లావాదేవీల సమర్థత పెరుగుతుంది. ఇది దేశంలో డిజిటల్ టోల్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతోంది. అయినా దీని పూర్తి ప్రయోజనాలను అనుభవించాలంటే వినియోగదారుల్లో సరైన అవగాహన అవసరం.
రూ. 3000 ఫాస్ట్ ట్రాక్ పాస్ ద్వారా ప్రయాణదారుల భారం తగ్గే అవకాశం ఉన్నా, ఇది ప్రస్తుతానికి పరిమిత వర్గాలకే ఉపశమనంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఇది మరిన్ని వాహన రకాలకూ, ఎక్కువ ట్రిప్పులకూ వర్తించేలా విస్తరించితే గానీ, ఇది నిజమైన మార్పు తీసుకొచ్చే హైవే ప్రయాణ సంస్కరణగా నిలవదు. ప్రస్తుతం ఇది ఒక ప్రయోగాత్మక అవకాశం. దీని విజయాన్ని వినియోగదారుల స్పందన, ప్రభుత్వ పరిష్కార సామర్థ్యం నిర్ణయించనుంది.