-
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉరిలా మారిన రైతు రుణమాఫీ పథకం..!
-
కట్టలు తెంచిన రైతుల ఆగ్రహం..!
-
న్యాయస్థానాల దాకా చేరిన రుణమాఫీ హామీ..!
-
రుణమాఫీ అమలు ప్రక్రియపై స్పష్టమైన వివరాలు ఇవ్వాలి -న్యాయమూర్తి జస్టిస్ జీ. మాధవీదేవి
-
అందరి చూపు హైకోర్టు ఫైనల్ తీర్పు పైనే..!
-
క్రైమ్ మిర్రర్ విశ్లేషణతో హాట్ న్యూస్ గా రాజకీయ వర్గాలలో వేడి..!
క్రైమ్ మిర్రర్ తెలంగాణ ఇన్వెస్టిగేషన్ బ్యూరో: ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతుల ఆగ్రహం న్యాయస్థానాల దాకా చేరింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ హామీ అమలులో తీవ్ర లోపాలున్నాయని ఆరోపిస్తూ రైతులు నేరుగా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
ఇది వ్యక్తిగత న్యాయపోరాటంగా కాకుండా, ప్రభుత్వ విధానాలపై రైతులు లేవనెత్తిన సమూహ ప్రశ్నగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం 2024 రైతు రుణమాఫీ పథకం కింద జీవో నెంబర్ 567 జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పథకం పూర్తి స్థాయిలో అమలుకాలేదని రైతులు వాదిస్తున్నారు.
అర్హులైన తమ పేర్లు లబ్ధిదారుల జాబితాల్లో లేకపోవడంతో బ్యాంకుల నుంచి ఒత్తిళ్లు, వడ్డీ భారం ఎదుర్కొంటున్నామని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవ అమలుకు మధ్య భారీ అంతరం ఉందని ఆరోపించారు.
ఈ న్యాయపోరాటానికి ఆరంభం యాదాద్రి జిల్లా జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు బద్దం నరసింహ రెడ్డి పిటిషన్. తన అప్పు రద్దు కాలేదని, అర్హతలు ఉన్నా అన్యాయం జరిగిందంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ వెలుగులోకి వచ్చిన తర్వాత నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన మరికొంత మంది రైతులు కూడా తాము మోసపోయామని పేర్కొంటూ కోర్టును ఆశ్రయించారు.

దీంతో ఈ అంశం ఒక్క రైతుకి పరిమితమవకుండా, ఉమ్మడి జిల్లాల రైతుల సమస్యగా మారింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణించిన ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయ శాఖ అధికారులకు, సంబంధిత బ్యాంకు అధికారులకు వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ జీ. మాధవీదేవి రుణమాఫీ అమలు ప్రక్రియపై స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.
అర్హుల జాబితా ఎలా రూపొందించారు..? ఎందుకు అనేక మంది రైతులు పథకం నుంచి లబిద్దిపొండలేదు అనే అంశాలపై స్పష్టత కోరారు. రైతుల వాదన ప్రకారం, రుణమాఫీపై ప్రభుత్వ మార్గదర్శకాలు క్షేత్రస్థాయికి సరిగా చేరలేదు. బ్యాంకులు ఒక్కొక్కటి ఒక్కో విధంగా వ్యవహరించడంతో గందరగోళం ఏర్పడిందని వారు ఆరోపిస్తున్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఆచరణలో మాత్రం రాజకీయ ప్రకటనగానే మిగిలిపోయిందన్న భావన రైతుల్లో నెలకొందని చెబుతున్నారు. అప్పులు రద్దు కాకపోవడంతో వడ్డీ భారం మరింత పెరిగి జీవనోపాధి కష్టమవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రధాన ఎన్నికల హామీ కావడంతో, ఈ కేసు రాజకీయంగా అత్యంత కీలకంగా మారింది.
కోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడితే, ప్రభుత్వం పథకం అమలును తిరిగి సమీక్షించి విస్తృతంగా అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశముంది. అదే సమయంలో, రాష్ట్రవ్యాప్తంగా మరెన్ని ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తాయన్న చర్చ కూడా మొదలైంది.
క్రైమ్ మిర్రర్ విశ్లేషణలో ఇది కేవలం నల్గొండ జిల్లాకు పరిమితమైన సమస్య కాదని స్పష్టమవుతోంది. డేటా లోపాలా..? విధాన పరమైన తప్పిదాలా..? లేక అధికారుల నిర్లక్ష్యమా..? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సిన అవసరం ఉంది.
రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే రుణమాఫీ హామీ కాగితాలకే కాకుండా క్షేత్రాల్లోనూ అమలవ్వాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ ఇప్పుడు న్యాయస్థానాల దాకా చేరింది. ఇప్పుడు అందరి చూపు హైకోర్టు తీర్పు, ప్రభుత్వ స్పందనపై కేంద్రీకృతమైంది.





